‘శోక’ మహేంద్రి | first day, lost their lives Pushkarni abhagyulu | Sakshi
Sakshi News home page

‘శోక’ మహేంద్రి

Jul 15 2015 2:07 AM | Updated on Sep 28 2018 3:41 PM

‘శోక’ మహేంద్రి - Sakshi

‘శోక’ మహేంద్రి

అయినవారిని పోగొట్టుకున్న బంధువులు, మిత్రుల రోదనలతో రాజమహేంద్రవరం(రాజమండ్రి) ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం

పుష్కరాల తొలి రోజే ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు
 

శవాల గుట్టలా రాజమండ్రి ఆస్పత్రి ప్రాంగణం
మిన్నంటిన బంధువుల రోదనలు
బాబును నిలదీసిన బాధితులు

 
రాజమండ్రి: అయినవారిని పోగొట్టుకున్న బంధువులు, మిత్రుల రోదనలతో రాజమహేంద్రవరం(రాజమండ్రి) ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం శోకసాగరమైంది. పుష్కరాల తొలి రోజే తొక్కిసలాటలో బలైపోయిన 27 మంది అభాగ్యుల మృతదేహాలతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారే ఉన్నారు.

 పుణ్యం కోసం వస్తే...
 పుష్కర స్నానంతో ఎంతో పుణ్యం కలుగుతుందని బంధుమిత్రులతో కలిసి వచ్చిన వారి కుటుంబాల్లో విషాదమే మిగిలింది. మృత దేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. మార్చురీ వద్ద సరిపడినంత చోటు లేకపోవడంతో ఆరుబయటే పడుకోబెట్టి, అందరూ చూస్తుండగానే పోస్టుమార్టం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా వేమగిరికి చెందిన దేశినీడి కృష్ణవేణి(52) మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి వీల్లేదంటూ ఆమె బంధువులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లిపోయారు. అయితే మళ్లీ పోస్టుమార్టానికి తీసుకువచ్చారు. సాయంత్రానికి పోస్టుమార్టం చేసి మృతదేహాలను లారీల్లో వారి స్వగ్రామాలకు తరలించారు.

 రాజమహేంద్రి.. శోకమహేంద్రమైంది
 ఓవైపు పోస్టుమార్టం జరుగుతుండగా మరోవైపు మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. భర్తను పోగొట్టుకుని భార్య, పిల్లలు దూర మై తల్లి, సోదరి దూరమై సోదరుడు, మనవలు దూరమై అమ్మమ్మలు పడుతున్న వేదన వర్ణణాతీతం. ఇలా ప్రతి ఒక్కరూ చనిపోయిన తమవారితో పెనవేసుకున్న బంధాలను గుర్తు చేసుకుని విలపిస్తుంటే పుష్కర శోభతో వైభవంగా వెలిగిపోవాల్సిన రాజమహేంద్రి.. గుండె పగిలి శోకమహేంద్రియై కన్నీరు పెట్టింది.

నేతలపై జనాగ్రహం
పుణ్యం కోసం గోదారమ్మ ఒడికి వచ్చినవారిని తమ నిర్లక్ష్యంతో మృత్యు ఒడికి చేర్చిన పాలకులపై బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిదానంగా మృతదేహాలను చూసేందుకు వచ్చిన మంత్రి కామినేని శ్రీనివాస్‌ను వారు అడ్డుకున్నారు. తమవారి ప్రాణాలు తిరిగివ్వమంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. దానికే తననేదో చేసేస్తున్నారనుకున్న అమాత్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత సీఎం చంద్రబాబుతో కలిసి వచ్చారు. సీఎంను సైతం బాధితులు నిలదీశారు. ‘మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మావారి ప్రాణాలు పోయాయ’ంటూ దుమ్మెత్తిపోశారు. దీంతో ఆయన అక్కడ ఎక్కువ సమయం ఉండకుండా వెనుదిరిగారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement