నాడు వద్దు.. నేడు ముద్దు! | chandrababu dual stand on bauxite lease in visakhapatnam | Sakshi
Sakshi News home page

నాడు వద్దు.. నేడు ముద్దు!

Oct 25 2015 12:01 PM | Updated on May 3 2018 3:17 PM

నాడు వద్దు.. నేడు ముద్దు! - Sakshi

నాడు వద్దు.. నేడు ముద్దు!

నాడు వద్దన్నవే నేడు ముద్దుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన అంశాలనే ఇప్పుడు సమర్థిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్: నాడు వద్దన్నవే నేడు ముద్దుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన అంశాలనే ఇప్పుడు సమర్థిస్తున్నారు. విశాఖలోని బాక్సైట్ లీజులు - అల్యూమినా కర్మాగారం ఏర్పాటు ఒప్పందం, ఆధార్ అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లుల పెంపు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ లీజులు, అల్యూమినా కర్మాగారం ఏర్పాటు ఒప్పందం గిరిజన హక్కులకు తీవ్ర భంగకరమని, వీటిని తక్షణమే రద్దు చేయాలంటూ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీ లోపలా, వెలుపలా పలుమార్లు డిమాండ్ చేశారు.

2014లో అధికారం చేపట్టగానే మాట మార్చేశారు. ప్రస్తుతం బాక్సైట్ తవ్వకాలకు, అల్యూమినా కర్మాగారం ఏర్పాటుకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళన చేస్తుండగా... ‘మీకు అభివృద్ధి అవసరం లేదా? మీ పిల్లలకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా? వారు కూడా మీలాగే అడవుల్లో అనారోగ్యంతో, సమస్యలతో మగ్గిపోవాలా? కర్మాగారాన్ని వద్దనడమంటే ప్రగతిని అడ్డుకోవడమే’ అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రశ్నించడం గమనార్హం.

ప్రతిపక్ష నేతగా అన్నదేమిటి?
‘విశాఖ జిల్లాలో గిరిజనుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం బాక్సైట్ నిల్వలున్న భూములను జిందాల్, రస్ - ఆల్ - ఖైమా సంస్థలకు కట్టబెట్టింది. ప్రజా ప్రయోజనాలను విస్మరించి రూ.లక్షల కోట్ల విలువైన గనులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ రాత్రికి రాత్రే రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై సభా సంఘాన్ని నియమించాలి’ అని 2010 మార్చి 8న అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారు. 

‘బాక్సైట్ ఒప్పందాలు, అల్యూమినా కర్మాగారం ఏర్పాటు ద్వారానే గిరిజనుల ప్రగతి సాధ్యమవుతుంది. వీటిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదు’ అని హెచ్చరిస్తున్నారు. ‘అంటే బాక్సైట్ లీజులు, అల్యూమినా ఫ్యాక్టరీ ఏర్పాటు ఒప్పందం అన్నీ సక్రమంగా జరిగినట్లే కదా? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడేదో జరిగిపోయినట్లు, వైఎస్ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్లు అప్పట్లో చంద్రబాబు బురద చల్లడం తప్పుకాదా?’ అని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.   

అన్నింటా అంతే
యూపీఏ ప్రభుత్వం వంట గ్యాస్ రాయితీకి ఆధార్‌ను అనుసంధానం చేయడాన్ని రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే అన్నింటికీ ఆధార్‌తో లంకె పెడుతూ సబ్సిడీలకు కోత వేశారు. ఆధార్ లేదనే సాకుతో చంద్రబాబు సర్కారు చాలామందిని రుణ మాఫీకి అనర్హులను చేసింది. 2014 కరువుకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీని కూడా ఆధార్‌తో లింకు పెట్టింది.

రైతుల పట్టాదారు పాసుపుస్తకాల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకూ అన్నింటికీ ‘ఆధారే ఆధారం’ అని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షంలో ఉండగా సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లుల పెంపును తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా పెంచేయడం గమనార్హం. ‘చంద్రబాబుకు ప్రతిపక్షంలో ఉండగా తప్పుగా కనిపించనవన్నీ అధికారంలోకి రాగానే ఒప్పులుగా మారిపోతాయి’ అని అధికారులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement