చొప్పదండి ఎమ్మెల్యేకు చుక్కెదురు.!

TRS MLA Ravi Shankar Blackout By People In Choppadandi - Sakshi

ఎమ్మెల్యేను అడ్డుకున్న ముంపు నిర్వాసితులు   

సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని మాన్వాడలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు పరిసరాల్లో సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను నీలోజిపల్లి, కుదురుపాక గ్రామానికి చెందిన నిర్వాసితులు  అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట పరిసరాల్లో ఎంపీ సంతోష్‌కుమార్‌ ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే వచ్చారు. మొదట ప్రాజెక్ట్‌ సమీపంలోని ప్రైవేట్‌ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తనను నిర్వాసితులు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో నిర్వాసితులు ఉన్న ప్రాంతం నుంచి కాకుండా మిడ్‌మానేరు కట్టపై నుంచి గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ సమాచారం అందుకున్న నిర్వాసితులు అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే వాహనం ఎదుట బైఠాయించారు. వెంట ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుతప్పించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రావాలని నిర్వాసితులు పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే తన వాహనం దిగి నిర్వాసితులు కూర్చున్న స్థలం వద్దకు వచ్చి కూర్చున్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు పరిహారం ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని, 18 ఏళ్లు నిండిన యువతులకు రూ.2 లక్షల ప్యాకేజీతోపాటు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పెండింగ్‌ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ను బతిమిలాడి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారని  ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో సమస్యలపై మాట్లాడేందుకు రావాలని ఎమ్మెల్యే వారిని కోరినా స్పందించకపోవడంతో బైఠాయించిన నిర్వాసితులను పోలీసులు పక్కకు తొలగించడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top