74 లక్షల ఖాతాల్లో రూ.1,111 కోట్లు జమ

Telangana Govt Helping Hand To Poor people - Sakshi

ఉచిత బియ్యం, నగదు కోసం రూ. 2,214 కోట్లు 

2.40 కోట్ల మంది లబ్ధిదారులకి బియ్యం పంపిణీ పూర్తి 

మిగిలిన కుటుంబాలకు త్వరలోనే నగదు జమ 

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు అందిస్తున్న సాయాన్ని ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 74 లక్షల లబ్ధిదారుల కుటుంబాలకు రూ.1,500 చొప్పున రూ.1,111 కోట్లు జమ చేసింది. మిగతా కుటుంబాలకు ఈ సాయాన్ని అందించే ప్రక్రియను కొనసాగిస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు పన్నెండు కిలోల బియ్యం, నిత్యావసర సరుకుల కొనుగోలుకై అందిస్తున్న సాయంతో కలిపి మొత్తంగా రూ.2,214 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 87.54 లక్షల కుటుంబాల్లోని 2.80 కోట్ల లబ్దిదారులకుగాను 2.40 కోట్ల మంది లబ్ధిదారులకు ఇప్పటికే రేషన్‌ పంపిణీ ప్రక్రియను పూర్తి చేసింది. దీనికోసం 3.04 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది.

గడిచిన మార్చ్‌ నెలలో 83శాతం మంది రేషన్‌ తీసుకోగా, ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితులు, 12 కిలోల ఉచిత బియ్యం నేపథ్యంలో ఈ ఏప్రిల్‌ నెలలో ఇప్పటి వరకు 88.11శాతం మంది రేషన్‌ తీసుకున్నారు. గత నెలకంటే దాదాపు 5శాతం మంది అధికంగా రేషన్‌ తీసుకున్నారని వివరించారు. ఇక బియ్యంతోపాటు పప్పు, ఉప్పులాంటి సరుకుల కోసం ఒక్కో కుటుంబానికి రూ. 1,500 చొప్పున 74 లక్షల కుటుంబాలకు రూ. 1,111 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయగా, మిగిలిన కుటుంబాలకు సాంకేతిక కారణాలతో సమస్యలు ఎదురవడంతో జమ చేయలేదు. త్వరలో వీరికి కూడా నగదు జమ చేయనున్నారు. ఈ నగదు జమ చేయడం కోసం గడిచిన మూడు రోజులుగా పౌరసరఫరాల ఐటీ, సీజీజీ సిబ్బంది నిరంతరాయంగా పనిచేశారు.  

మాట నిలబెట్టుకున్నాం: మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి 
రాష్ట్రంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరుపేద ప్రజలెవరూ ఆకలితో అలమటించరాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 12 కిలోల ఉచిత బియ్యం, రూ. 1,500 సాయం అందించారని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటికే 88శాతం మందికి రేషన్‌ పంపిణీ పూర్తి చేశామని, 74 లక్షల కుటుంబాలకు నగదు జమ చేశామని వెల్లడించారు.

సాంకేతిక కారణాలు కొలిక్కివచ్చిన వెంటనే మిగతా కుటుంబాలకు నగదు జమ చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దని తెలిపారు. ఇక ధాన్యం సేకరణకు గన్నీ సంచుల కొరతను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే హమాలీల కొరతను అధిగమించేందుకు బిహార్‌ రాష్ట్రం నుంచి హమాలీలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top