పట్టాలెక్కేదెప్పుడో?

Suspends On Bodan And Bidar Railway Line - Sakshi

80 ఏళ్లుగా ప్రతిపాదనల్లోనే బోధన్‌– బీదర్‌ రైల్వే లైన్‌

సర్వేకే పరిమితం.. రెట్టింపైన అంచనా వ్యయం

రాష్ట్రం, కేంద్రం చెరిసగం భరిస్తేనే మోక్షం

నారాయణఖేడ్‌: దశాబ్దాలు గడుస్తున్న బోధన్‌–బీదర్‌ రైల్వేలైన్‌కు మోక్షం కలగడం లేదు. ప్రతీసారి బడ్జెట్‌లో ఆశలు నెరవేరుతాయని ఎదురుచూడడం.. నిరాశే మూటగట్టుకోవడ పరిపాటిగా మారింది. ఒకటికాదు రెండు కాదు ఎనిమిది దశాబ్దాలుగా బోధన్‌– బీదర్‌ రైల్వేలైన్‌ పట్టాలెక్కడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, నేతలు మారుతున్నా అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. స్వరాష్ట్రంలోనైనా కలనెరవేరుతుందని ఆశించినా అడియాసే ఎదురవుతోంది.

బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌ పొడిగించేందుకు 1938లో నిజాం సర్కార్‌ హయాంలో ప్రతిపాదనలు చేశారు. బోధన్‌–బాన్సువాడ–పిట్లం– నారాయణఖేడ్‌–బీదర్‌ ప్రాంతాల ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి లైన్‌ క్లియర్‌ చేశారు. ఆదిలాబాద్‌–పటాన్‌చెరు మధ్యకొత్తగా మరో రైల్వేలైన్‌  సర్వేకోసం ఆదేశించారు. 138 కిలోమీటర్ల బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌ కోసం 2011 ఏప్రిల్‌లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్‌ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్‌ మీదుగా బీదర్‌వరకు సర్వే పూర్తి చేశారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. రూ.1,029 కోట్ల వ్యయంతో లైన్‌ వేయొచ్చని అధికారులు తేల్చారు. నారాయణఖేడ్‌ సమీపంలోని జి.హుక్రాన సమీపంలో ఈమేరకు అధికారులు హద్దురాళ్లు పాతడం, రోడ్లపై మార్కింగ్‌ సైతం వేశారు. దశలవారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గమధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితిపై అంచనా వేసి రైల్వేశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. సర్వే విషయమై అప్పటి ఎంపీ సురేష్‌ షెట్కార్‌ పార్లమెంట్‌లోనూ ప్రస్తావించారు.

రాష్ట్రం నుంచి స్పందన కరువు..
2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్‌లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. ఇప్పటివరకు నాలుగు బడ్జెట్‌లు పూర్తయినా పైసా విదిల్చింది లేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాలకు నిధులు కేటాయించిన కేంద్రం బోధన్‌–బీదర్‌ రైల్వే లైన్‌కు మాత్రం మొండిచేయి చూపించింది. రూ.1,029 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపొందించారు. జాప్యం కారణంగా వ్యయం రెట్టింపై రూ.2వేల కోట్లకు చేరింది. మారిన నిబంధనల ప్రకారం రైల్వేలైన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులు కేటాయిస్తే కేంద్రం సగం కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువయ్యింది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో ఇప్పట్లో ఈ రైలుమార్గానికి మోక్షం                కలిగేలా లేదు.  

రైల్వేలైన్‌ ఏళ్లనాటి కల
రైల్వే లైన్‌ ఏర్పాటు ఏళ్లనాటి కల. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలి. బోధన్‌–బీదర్‌ రైల్వేలైన్‌ ఏర్పాటు జరిగితే రవాణా పరంగా ఎంతో మేలు చేకూరుతుంది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
–చిరంజీవి, తుర్కాపల్లి, నారాయణఖేడ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top