తవ్వుడు.. పోస్కపోవుడు.. 

Soil Mafia In Khammam - Sakshi

మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. నగరం చుట్టుపక్కల, ఆనుకుని ఉన్న భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. ఇక్కడ కొన్న వ్యవసాయ భూములను చదును చేసేందుకు మట్టి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంకేముంది అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల నుంచి, అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా మట్టి తోలకాలు విచ్చలవిడిగా చేపడుతున్నారు. నగరంలో నిర్మించే ఇళ్ల నిర్మాణానికి కూడా అక్రమార్కులు ఇక్కడి నుంచే మట్టిని తరలిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

సాక్షి, ఖమ్మం: నగరానికి అతిసమీపంలో ఉన్న ఖమ్మంరూరల్‌ మండలంతోపాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్‌ మండలాల్లో మట్టిదందా నిరాటంకంగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు రూరల్‌ మండలం గుర్రాలపాడు, తెల్దారుపల్లి, ఏదులాపురం, ముత్తగూడెం, ఆరెకోడు, గుదిమళ్ల, ఎం.వెంకటాయపాలెం తదితర గ్రామాలను ఎంచుకుని రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రక్కు మట్టిని రూ.600 నుంచి రూ.700 వరకు అమ్ముకుంటూ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల నుంచి మట్టిని తరలించాలన్నా.. లేదా ప్రైవేట్‌ భూమిని చదును చేసుకోవాలన్నా సంబంధిత వీఆర్వోకు దరఖాస్తు చేసుకోవాలి.

వీఆర్వో సంబంధిత ప్రదేశానికి వెళ్లి పర్యావరణానికి ముప్పు రాదనుకుంటేనే అనుమతివ్వాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిలో ఏమైనా తవ్వకాలు జరపాలంటే మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకోసం కొంత నగదును ప్రభుత్వానికి సెస్‌ రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటివేమీ లేకుండానే మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. తాము తమ భూమిని చదును చేసుకుని.. అందులో నుంచి తీసే మట్టిని తమ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారుల నుంచి సదరు భూమి యజమాని అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఏవైనా రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల నుంచి అనుమతి తీసుకుని మాత్రమే మట్టిని తరలించాల్సి ఉంటుంది.

జరుగుతోందిలా.. 
అయితే అంతా తామే చూసుకుంటామని రైతులను నమ్మించి అక్రమార్కులు తమ పని కానిచ్చేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకున్న మట్టి అక్రమ రవాణాదారులు సదరు రైతుకు చెందిన భూమిలో మట్టిని తీసి.. ఎలాంటి అనుమతి లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లకు, ఇతర అవసరాలకు రేయింబవళ్లు తరలిస్తున్నారు. గతంలో వెంకటగిరిలో ఇదే విషయమై అక్రమార్కులను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి చేసిన విషయం విదితమే. నాలుగు రోజుల క్రితం కూడా అక్రమార్కులను అడ్డుకున్న అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.
 
లక్షల ట్రిప్పులు తరలింపు.. 
మండలంలోని గుర్రాలపాడు, ముత్తగూడెం, తెల్దారుపల్లి, ఏదులాపురం ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతి లేకుండానే మట్టిని తవ్వి లక్షల ట్రిప్పులు తరలించారు. దీంతో ప్రభుత్వ భూములను పీల్చిపిప్పి చేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం ఆ భూముల్లో ఏవైనా నిర్మాణాలు చేయాలంటే  లోతైన పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి.

పట్టించుకోని అధికారులు 
పగలూ, రాత్రి తేడా లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రతీ రోజు గమనించాల్సి ఉండగా.. తమ కళ్లెదుటే వందలాది ట్రక్కుల మట్టి తరలిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒక ఎత్తయితే.. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మట్టిని తరలించే అక్రమార్కుల నుంచి ఆమ్యామ్యాలు అందడం మరో కారణమనే బలమైన ఆరోపణలున్నాయి.

నామమాత్రపు దాడులు 
ఫలానా గ్రామంలోని శివారు ప్రాంతంలో మట్టిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు వీఆర్వో అక్కడికి వెళ్లి మందలిస్తే.. ఆ ఒక్కరోజు తోలకాలు నిలిపివేస్తున్నారు. మరుసటి రోజు నుంచి మళ్లీ మట్టి తోలకాలు చేపడుతున్నారు. మూడు రోజుల క్రితం గొల్లగూడెం, గుర్రాలపాడు రెవెన్యూ పరిధిలో కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను, జేసీబీని సీజ్‌ చేసి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. అనంతరం నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో వారికి జరిమానా వేసి వదిలేశారు.

అక్రమార్కుల మధ్య ఘర్షణ 
మండలంలో ఇటీవల అక్రమార్కుల మధ్య మట్టిని తరలించే విషయంలో ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఏదులాపురం, ఆరెంపుల, గొల్లగూడెం, ముత్తగూడెం పరిధిలో మట్టిని తాము తరలించే ప్రాంతానికి మీరు రావడం ఏమిటని ఇంకొందరు అక్రమార్కులు ఘర్షణ పడినట్లు తెలిసింది. ఈ వ్యవహారం పెద్దకు వద్దకు వెళ్లడంతో ఇరువర్గాలకు సర్ది చెప్పినట్లు తెలిసింది.   
 
చర్యలు తీసుకుంటాం.. 
ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో నుంచి మట్టిని తరలించాలంటే తప్పకుండా రెవెన్యూ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. అలా కాకుండా అక్రమంగా మట్టిని తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్రమంగా మట్టిని తరలించే వారిని.. గుర్తించి కొందరికి జరిమానా విధించాం. అనుమతులు లేకుండా మట్టిని తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు.  – అశోక్‌చక్రవర్తి, తహసీల్దార్, 
ఖమ్మం రూరల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top