పారిశ్రామికవాడ.. దడ

Robberies Increasing In Patancheru Industrial Area - Sakshi

జిన్నారం(పటాన్‌చెరు) : వరుస చోరీ ఘటనలు పారిశ్రామికవాడల్లో  వణుకుపుట్టిస్తున్నాయి. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ దోపిడీలతో అటు వ్యాపారులు, ఇటు స్థాని కులు కలవరానికి గురవుతున్నారు. జిన్నారం మండలం బొల్లారం ఇటీవల మున్సిపాలిటీగా అవతరించింది. ఈ గ్రామంలో 200 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి జనాభా 40 వేలకు పైనే ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడి పరిశ్రమల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒడిషా, బీహార్‌ లాంటి రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు.

గుర్తుతెలి యని వ్యక్తులు ఎక్కువగా ఉండే ఈ ప్రాం తంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. గతంలోనూ దుండగులు షాపులను టార్గెట్‌ చేస్తూ దోపిడీలకు దిగారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందులో కొన్ని కేసులను మాత్రమే పోలీసులు ఛేదించగలిగారు. చిన్న చిన్న చోరీలతో పాటు ఏకంగా లక్షల విలువైన వస్తువులను చోరీ చేసే స్థాయికి దొంగలు  తెగబడ్డారు. జ్యువెలరీ షాపులను లక్ష్యంగా చేసుకోవడం పోలీసులకు సవా ల్‌గా మారింది. తాజాగా బొల్లారంలోని ఓ నగల దుకాణానికి ఏకంగా కన్నం వేసి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు.

సీఐస్థాయి పోలీస్‌ స్టేషన్‌ ఉండడంతో పాటు, గ్రామంలోని పలు ప్రధాన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించినా, ఇటీవల తరచూ కార్డన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తున్నాచోరీలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. షాపుల్లో ఉన్న సీసీ కెమెరాలను మొదట పనిచేయకుండా చేసి తర్వాత తాపీగా వారి పని కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం బొల్లారంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. తమ షాపులను ఎలా రక్షించుకోవాలా అని వ్యాపారస్తులు ఆందోళనకు గురవుతుండగా, వరుస చోరీ ఘటనలతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు జంకుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top