నాలా విలన్లు!

Political Leaders Stop Drainage Nala Development in Hyderabad - Sakshi

నాలాల విస్తరణను అడ్డుకుంటున్న నాయకులు  

ఆస్తుల సేకరణకు ససేమిరా భవనాల జోలికివెళ్లొద్దని హుకుం జారీ  

ఫలితంగా తీరని ముంపు సమస్య  

మరోవైపు ‘టౌన్‌ప్లానింగ్‌’ నిర్లక్ష్య వైఖరి

యథేచ్ఛగా అక్రమ భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణం   

సమస్యల పరిష్కారానికి ‘ఓయెంట్స్‌’ సిఫార్సులు  

మూడు అంశాల్లో రూ.470 కోట్ల పనులకు అంచనా  

ఇప్పటికీ రూ.45 కోట్ల పనులే పూర్తి  

శేరిలింగంపల్లి జోన్‌లోని ఒక నాలా విస్తరణకు ఆస్తుల సేకరణలో భాగంగా ఓ అపార్ట్‌మెంట్‌లో కొంత భాగం సేకరించాలి. అందుకు స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ససేమిరా అన్నారు. ‘కావాలంటే నాలాను వంకర తిప్పుకోండి. కానీ ఆ భవనం జోలికి వెళ్లొద్దు’ అని హుకుం జారీ చేశారు. ఇందుకు కారణం ఆఅపార్ట్‌మెంట్‌లో ఆయనకు పడే300 ఓట్లు ఉన్నాయట. 

ఇది నాలాల విస్తరణ పనులకు కలుగుతున్న ఆటంకాల్లో ఓ మచ్చు తునక. ఇలా నగరవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ నాలాల విస్తరణకు స్థానిక నేతలు అడ్డుపడుతున్నారు. ఇతరత్రా కారణాలున్నప్పటికీ ప్రధానంగా ఇలాంటి సమస్యలతోనే అధికారులు ముందుకు వెళ్లలేకపోతున్నారు. 

మరోవైపు చాలా ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు అడ్డదిడ్డంగా వెలుస్తున్నాయి. ఆయా భవనాల నుంచి వెలువడే నీరు బయటకువెళ్లేందుకు దారి ఉందా? లేదా?అనేది చూడకుండానే టౌన్‌ప్లానింగ్‌అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇంకోవైపు చాలాచోట్ల అక్రమ భవనాలు వెలుస్తున్నా... అందిన కాడికి పుచ్చుకొనిచూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ప్రత్యక్షంగా నాయకులు, పరోక్షంగా అధికారులు ముంపుసమస్యకు కారణమవుతున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో భారీ వర్షం పడితే నాలాలు ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా బస్తీలు నీట మునుగుతున్నాయి. రహదారులు జలమయమవుతున్నాయి. నాలాలు విస్తరణకు నోచుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యల పరిష్కారానికి పలు కమిటీలు సిఫార్సులు చేసినా సక్రమంగా అమలు చేసిన దాఖలాలే లేవు. ఆరంభించడం.. మరచిపోవడం.. ఎంతో కొంత చేసి రూ.కోట్లు నాలాల్లో పోయడం.. ఇదీ ఏళ్ల తరబడి సాగుతున్న తంతు. ఇందుకు అనేకానేక కారణాలున్నప్పటికీ నేతల తీరుతోనే పరిస్థితి విషమిస్తోందని చెప్పొచ్చు. వివిధ ఆటంకాలతో ముందుకు సాగని పనులను అధికారులు ఎలాగోలా గట్టెక్కిద్దామనుకున్నా... నాయకులు హఠాత్తుగా అడ్డం పడతారు. పనులు ముందుకు కదలనివ్వరు. దీంతో ఇతర కారణాల కంటే నాయకులే సమస్యగా మారారనే ఆరోపణలున్నాయి.  
 
‘కిర్లోస్కర్‌’ బుట్టదాఖలు..  
నగరంలోని నాలాలు గంటకు 20 మి.మీ వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలవు. ప్రస్తుత పరిస్థితుల్లో గంటకు 60 మి.మీ. వర్షపాతం  నమోదవుతోంది. వివిధ నగరాలతో పాటు హైదరాబాద్‌లోనూ గ్లోబల్‌ వార్మింగ్‌ ఎఫెక్ట్‌ ఇందుకు ఒక కారణం. 2000 సంవత్సరం ఆగస్టులోవచ్చిన వరద విపత్తుతో నగరంలో ముంపు సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే దానిపై అధ్యయనం చేసిన కిర్లోస్కర్‌ కమిటీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సిఫార్సులు చేసింది. ఎంసీహెచ్‌ (మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌) పరిధిలోని 71 నాలాల్ని  170 కి.మీ.ల మేర విస్తరించాలని పేర్కొంది. కానీ ఆ పనులు జరగనేలేదు.

ఆక్రమణలు.. 28 వేలు    
2007లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అవతరించింది. అనంతరం గ్రేటర్‌లో ముంపు సమస్యను పరిష్కరించేందుకు ఓయెంట్స్‌ కన్సల్టెంట్‌ సంస్థ అధ్యయనం చేసి పలు సిఫార్సులు చేసింది. ఎప్పుడైనా సరే గంటకు 20 మి.మీ (రెండు సెం.మీ)కు పైగా వర్షం పడిదంటే చాలా ప్రాంతాలు నీట మునుగుతాయని స్పష్టం చేసింది. దీన్ని నివారించేందుకు నాలాల్లో వ్యర్థాలు వేయకుండా అడ్డుకోవడం, వాటిలోని చెత్తాచెదారం తొలగించడం, 390 కి.మీ మేర మేజర్‌ నాలాలను విస్తరించాలని చెప్పింది. ఆ పనులు చేయాలంటే 28 వేల ఆక్రమణలు తొలగించాలని, నాలాల ఆధునికీకరణకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.  
 
10 శాతమే పనులు..  
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక వరదల నియంత్రణకు చర్యలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఓయెంట్స్‌ సిఫార్సుల మేరకు నాలాలను ఆధునికీకరించాలంటే వాటి పరిధిలోకే వచ్చే 12,153 నిర్మాణాలను తొలగించాలని, అది ఆచరణయోగ్యం కాదని భావించి... 100 కి.మీ మేర అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని భావించారు. ఆ తర్వాత 47 బాటిల్‌నెక్‌ ప్రాంతాల్లో 16.60 కి.మీ డ్రోన్‌ సర్వే నిర్వహించారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అత్యవసర పరిష్కారానికి బాటిల్‌నెక్స్, మేజర్‌ స్టాగ్నేషన్, ఇతర సమస్యలు భాగాలుగా పనులు చేపట్టారు. ఇందుకు రూ.470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు దాదాపు రూ.45 కోట్ల పనులే చేశారు. అంటే 10 శాతం కూడా పూర్తి కాలేదు. మిగిలిన పనుల్లో అన్నీ పూర్తవుతాయో? లేదో? కూడా చెప్పలేం. అందుకు కారణం రాజకీయ నేతలు అడ్డుపడడం, వివిధ కారణాలు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top