యూఆర్‌ఎస్‌ విజయవంతమైంది: ఎంఈసీ

Mahindra Ecole Centrale Organizes National Undergraduate Research Symposium - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేందుకు ‘నేషనల్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ సింపోజియం’ పేరిట తాము నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైందని మహీంద్ర ఎకోలే సెంట్రల్‌(ఎంఈసీ) ఇంజనీరింగ్‌ విద్యా సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 300కు పైగా విద్యార్థులు హాజరయ్యారని పేర్కొంది. ఇందులో భాగంగా పరిశోధనా విభాగానికి సంబంధించి 12 మౌఖిక, 30 పోస్టర్లను విద్యార్థులు సమర్పించారని తెలిపింది. వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు 65 వేల రూపాయల విలువైన బహుమతులు అందజేసినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత ప్రొఫెసర్‌ అజయ్‌ ఘటక్‌, సైబర్‌ భద్రతా విభాగం సీఈఓ డాక్టర్‌ శ్రీరామ్‌ బిరుదవోలు ముఖ్య అతిథులుగా హాజరై... స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌ నాయకత్వాల గురించి విద్యార్థులకు వివరించినట్లు పేర్కొంది.

నేషనల్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ సింపోజియం’ లో భాగంగా టెక్ మహీంద్ర మెషీన్ లెర్నింగ్‌తో కలిసి ఎంఈసీ క్లబ్‌ ఎనిగ్మా12 గంటల కోడింగ్‌ ఛాలెంజ్‌ను నిర్వహించినట్లు ఎంఈసీ తెలిపింది. అదే విధంగా స్టార్టప్‌ ఐడియా కాంటెస్ట్‌ కూడా నిర్వహించామని..ఈ పోటీకి పారిశ్రామికవేత్తలు డాక్టర్‌ ఎ.శ్రీనివాస్‌(ఏఐపీఈఆర్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌), రాఘవేంద్ర ప్రసాద్‌(ఫారిగేట్‌ అడ్వైజరీ సొల్యూషన్స్‌ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌), శ్రీచరణ్‌ లక్కరాజు(స్టమాజ్‌ సీఈఓ) న్యాయ నిర్ణేతలుగావ్యవహరించారని పేర్కొంది. ఈ పోటీలో గెలుపొందిన ఓ విద్యార్థి బృందం.. స్టార్టప్‌ పెట్టుబడులకై జడ్జీల నుంచి ఆఫర్‌ను సైతం సొంతం చేసుకుందని వెల్లడించింది.

 

అదే విధంగా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన డిజైన్‌ అండ్‌ ప్రొటోటైప్‌ కాంటెస్ట్‌లో 12 బృందాలు పాల్గొన్నాయని వెల్లడించింది. ఈ కార్యక్రమం గురించి ఎంఈసీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యాజులు మెడ్యూరీ మాట్లాడుతూ..‘2018లో నిర్వహించిన సింపోజియంకు మంచి ఆదరణ లభించింది. అందుకే ఈసారి జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించాం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు యువ పారిశ్రామికవేత్తలను వెలికితీసేందుకు దోహదపడతాయి’ అని పేర్కొన్నారు. కాగా మహీంద్ర గ్రూప్‌లో భాగమైన అంతర్జాతీయ కళాశాల ఎంఈసీని మహీంద్ర యాజమాన్యం 2013లో హైదరాబాద్‌లో నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top