అప్పు చేసి మధ్యాహ్న భోజనం

Lack Of Midday Meal Funding In Kamareddy - Sakshi

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 698, ప్రాథమికోన్నత పాఠశాలలు 129, ఉన్నత పాఠశాలలు 186 ఉన్నాయి. వీటిలో లక్ష 20 వేల విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో 420 మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు.

100 మంది విద్యార్థులు దాటిన పాఠశాలలలో ఇద్దరు చొప్పున వర్కర్‌లు ఉంటారు. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా.. గుడ్లు, పండ్లు, ఇతర సరుకులను ఏజెన్సీ నిర్వాహకులే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తర్వాత బిల్లులు చెల్లిస్తుంది. అయితే జిల్లాలో ఫిబ్రవరినుంచి బిల్లులు రావడం లేదు.

రూ. కోటికిపైగా బకాయిలు 

జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకానికి సంబం ధించి ఏజెన్సీ నిర్వాహకులకు గత విద్యా సం వత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ బిల్లులు రావాల్సి ఉంది. ఒక్కో నిర్వాహకుడికి రూ. 40 వేల నుంచి రూ.లక్షకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ప్రతి ఏజెన్సి నిర్వాహకుడికి గౌ రవ వేతనంగా ప్రభుత్వం రూ. 1000 చెల్లిస్తోంది. జిల్లాలో 600 మందికిపైగా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు.

వారికి ఎనిమిది నెలలుగా గౌరవ వేతనం విడుదల కాలేదు. మధ్యాహ్న భోజన బిల్లులతోపాటు నిర్వాహకుల గౌరవ వేతనం బిల్లులు కలిపి కోటి రూపాయలకుపైగా రావాల్సి ఉంది. బిల్లులు రాకపోవడంతో అప్పులు చేయా ల్సి వస్తోందని భోజన ఏజెన్సీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.

బిల్లులు వస్తలేవు..

నేను కామారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం నిర్వహిస్తున్నాను. ఫిబ్రవరి నుంచి బిల్లులు వస్తలేవు. గౌరవ వేతనం కూడా ఎనిమిది నెలలుగా ఇస్తలేరు. ఇబ్బందిగా ఉంది. విద్యార్థులకు భోజనం వండి పెట్టడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. వెంటనే బిల్లులు చెల్లించాలి.   – నర్సింలు, ఏజెన్సీ నిర్వాహకుడు, కామారెడ్డి 

వారంలో చెల్లిస్తాం

ప్రభుత్వం నుంచి ఇటీవలే బడ్జెట్‌ విడుదలైంది. అన్ని పాఠశాలల బిల్లులు సిద్ధం చేశాం. వారం రోజుల్లో బిల్లులను చెల్లిస్తాం.  – రాజేశ్, ఇన్‌చార్జి డీఈవో, కామారెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top