ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఎల్లంపల్లి నీరివ్వాలి

Gujjula Ramakrishna Reddy Speech In Dharmapuri At Karimnagar - Sakshi

జిల్లా రైతులను కాదని ఇతర జిల్లాలకు తరలించడం అన్యాయం

సెప్టెంబర్‌ 6న ధర్మారంలో రైతు ఉద్యమం

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి

సాక్షి, ధర్మారం(ధర్మపురి): ఎల్లంపల్లి నీటిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు డీ–83 కెనాల్‌ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం ప్రకటన చేయాలని లేని పక్షంలో సెప్టెంబర్‌ 6న రాష్ట్ర రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టుతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. ధర్మారం మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎల్లంపల్లి నీటిని దోపిడి చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నాడని ఆరోపించిన కేసీఆర్‌ ప్రస్తుతం ఆయన చేస్తున్న పనేంటో స్పష్టం చేయాలన్నారు. ఎల్లంపల్లి నిర్మాణ సమయంలో పేర్కొన్న డీపీఆర్‌లో ఆంధ్ర ప్రాంతానికి నీరు తరలిస్తున్నట్లు ఎక్కడ లేదని మాయమాటలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ తప్పుదోవపట్టించారని ఆరోపించారు.

అప్పటి డీపీఆర్‌లో ఎల్లంపల్లి నీటిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కెనాల్‌ డీ–83 ద్వారా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు సాగునీరందించాలని స్పష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ డీపీఆర్‌కు విరుద్ధంగా ఇక్కడ రైతులకు సాగునీరందించకుండా హైదరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్‌ 6లోగా ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా రైతులకు సాగునీరందించే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని లేకుంటే రైతు ఉద్యమం చేపట్టాల్సివస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, ప్రధానకార్యదర్శి కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కన్నం అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్, తీగుల్ల సతీష్‌రెడ్డి, సందనేని లక్ష్మణ్, పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్‌ తాడ్వాయి రాంగోపాల్‌రెడ్డి, నాయకులు మెడవేని శ్రీని వాస్, ఎల్లాల మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top