సినిమా ట్విస్ట్‌లను తలపిస్తున్న దళితుల కేసు..

Another Twist in Nizamabad Abhangapatnam Dalits Kidnap Case - Sakshi

ప్రాణాలు కాపాడుకోవడానికే అలా చెప్పాం: బాధితులు

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్ జిల్లా అభంగపట్నంకు చెందిన దళితుల అదృశ‍్యం కేసు సినిమా ట్విస్ట్‌లను తలపిస్తోంది. 20 రోజుల తర్వాత అజ్ఞాతం నుంచి వెలుగులోకి వచ్చిన ఇద్దరు దళితులు తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, సినిమా షూటింగ్ కోసమే అలా నటించామని చెప్పిన వారు... తాజాగా మాట మార్చారు. తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే సినిమా షూటింగ్‌లో నటించామని చెప్పామని శనివారం చెప్పడం విశేషం. లాయర్‌ చెప్పమన్నందుకే అలా చెప్పామని, ఆత్మరక్షణ కోసమే అబద్ధం ఆడాల్సి వచ్చిందని బాధితులు చెప్పారు.

నిన్న పోలీసుల అదుపులో ఉన్నప్పుడు అభంగపట్నం బాధితులు... భరత్ రెడ్డికి తమ అదృశ్యానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పగా, ఇవాళ మాత్రం... తమ అదృశ్యానికి పూర్తి కారణం భరత్‌ రెడ్డే అని చెప్పుకొచ్చారు. తమ సెల్‌ ఫోన్లు కూడా ఇప్పటికీ భరత్‌ రెడ్డి దగ్గరే ఉన్నాయని బాధితులు వాపోయారు. ఇరవై రోజులు కుటుంబాలకు దూరంగా నరకం అనుభవించామన్నారు. భరత్‌ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, అతడిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు లక్ష్మణ్, రాజేశ్వర్‌ డిమాండ్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే..అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకున్నారనే నెపంతో బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లా అభంగపట్నంలో దళిత యువకులు లక్ష్మణ్, రాజేశ్వర్‌లను మురికి కుంటలో ముంచి, ముక్కు నేలకు రాయించి, దూషించిన వీడియోలు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం విదితమే. సెప్టెంబర్‌ 17న జరిగిన ఈ ఘటన వీడియోలు ఇటీవలే వెలుగు చూశాయి. ఈ క్రమంలో దీనిపై దళిత, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఈ నేపథ్యంలో దళిత యువకులపై దౌర్జన్యం కేసు మలుపు తిరిగింది.

‘దొరల రాజ్యం’సినిమాలో నటించాం
బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి తమను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని బాధితులు బచ్చల రాజేశ్వర్, కొండ్రా లక్ష్మణ్‌ నిన్న (శుక్రవారం) మీడియాతో వివరించారు. తమను మురికి నీళ్లలో ముంచడం.., ముక్కు నేలకు రాయించడం వంటి వీడియోలు, చిత్రాలన్నీ కేవలం సినిమా షూటింగ్‌ మాత్రమే అని మీడియాకు వివరించడం చర్చనీయాంశంగా మారింది. ‘దొరల రాజ్యం’పై వారు షూటింగ్‌ చేస్తున్నామంటే అందులో తాము నటించామన్నారు. ఇందుకోసం మాకు రూ.20 వేల చొప్పున పారితోషికం ఇస్తామన్నారని వారు చెప్పారు. తమను ఎవరూ అవమాన పరచలేదని, తమపై ఎవరూ దౌర్జన్యం చేయలేదని బాధితులిద్దరూ మీడియాకు వివరించారు.

ఈ ఘటనపై పోలీసులకు అందిన ఫిర్యాదులపై స్పందిస్తూ మమ్మల్ని అడగకుండా పోలీసులకు ఎలా ఫిర్యాదు ఇస్తారని వారు ప్రశ్నించారు. ఈ విషయంలో రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. డబ్బులు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పిస్తున్నారన్న విషయమై వారు స్పందిస్తూ అలాంటిదేమీ లేదని అన్నారు. తమను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తామే ఉపాధి కోసం పనులు వెతుక్కుంటూ హైదరాబాద్‌ వచ్చామని బాధితులు చెప్పారు. దీంతో ఇంతకాలం ఆచూకీ లేకుండా పోయిన బాధితులిద్దరినీ జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని నిజామాబాద్‌ జిల్లాకు తరలించారు

కాగా గత నెల 12వ తేదీన కిడ్నాప్‌కు గురైన లక్ష్మన్, రాజేశ్వర్‌లను హైదరాబాద్‌లో పట్టుకున్నామని ఏసీపీ సుదర్శన్‌ తెలిపారు. బాధితులను భరత్‌రెడ్డి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని ఫిర్యాదు రావడంతో పోలీసులను రంగంలో దింపి గాలించామన్నారు. బాధితులను శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. భరత్‌రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు అయ్యిందని బాధితులు దొరికినప్పటికీ భరత్‌రెడ్డి దొరకలేదన్నారు. బాధితుల నుండి పూర్తి వివరాలు తీసుకున్నాం. దానిని బట్టి భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామన్నారు. మా విచారణలో బాధితులు కేసుకు సంబంధించి విషయాలు తెలిపారు. ఇది కోర్టు డాక్యుమెంట్‌ పరిధిలోకి వచ్చే అంశం కాబట్టి చెప్పడానికి వీలు లేదన్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధితులు దొరల రాజ్యం సినిమా షూటింగ్‌ వెళ్లినట్లు చెప్పుతున్నారని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని దాటవేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top