రోగమొస్తే గందరగోళమే

Yashaswini Scheme Negligence In Karnataka - Sakshi

కుదురుకోని ఆరోగ్య కర్ణాటక పథకం  

పేదల చికిత్సకు కనాకష్టాలు   

మొదట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స  

ఆ తరువాత సిఫార్సుతోనే కార్పొరేట్‌ వైద్యసేవలు  

ఇందుకు చాలా జాప్యం  

యశస్విని కార్డులు బుట్టదాఖలు

లింగయ్యకు హఠాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. ప్రభుత్వ ఆరోగ్య పథకం ఉంది కదా అనే ధీమాతో కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్తే, పథకం వర్తించదు అని చల్లగా చెప్పారు. భార్యాపిల్లలు రోగిని గబగబా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తే నర్సులు గ్లూకోజ్‌ ఎక్కించారు. పెద్ద డాక్టర్లు వచ్చేదాకా నిరీక్షించాలని చెప్పారు. ఈలోగా రోగి పరిస్థితి విషమించింది.... ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోఅక్కడడక్కడా జరుగుతున్నాయి.  

బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆరోగ్య చికిత్సల పథకాలను విలీనం చేసి అమలు చేసిన ఆరోగ్య కర్ణాటక పథకం గందరగోళంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పథకం అమల్లోకి వచ్చి వారాలు గడిచినప్పటికీ అనేక లోటుపాట్లు ఎదురవుతున్నాయి. యశస్వినితో పాటు పాత పథకాల లబ్ధిదారులు చికిత్సకోసం ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు కొడుతున్నారు. సమాచార లోపంతో లబ్ధిదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. యశస్విని పథకం కింద వైద్య సౌలభ్యాలు ప్రజలకు సులభంగా అందేవి. కానీ దానిని కొత్త పథకంలోకి కలిపేశాక అనేకమంది రోగులకు సకాలంలోచికిత్సలు అందడం లేదు.

కొత్త పథకం కింద సేవలు పొందడానికి రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్షణమే అత్యవసర చికిత్సలు చేయించుకునే వెసులుబాటు లేదు. ఆరోగ్య సమస్యలు ఉంటే మొదట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి, అక్కడ ఆరోగ్య సేవలు అందుబాటులేని తరువాతనే వైద్యులు  రిఫర్‌ చేస్తే చేస్తే మాత్రమే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. కానీ ప్రైవేటు ఆసుపత్రి కూడా ఆరోగ్య కర్ణాటక పథకం కింద సేవలు అందించడానికి నమోదు చేసుకుని ఉండాలి. కానీ ఈ సమాచారం తెలియని యశస్విని పథకం కార్డులు పొందిన గ్రామీణ, నగర ప్రదేశ ప్రజలు కార్డుపట్టుకుని ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్సకోసం వెళుతున్నారు. 

ప్రైవేటు ఆస్పత్రుల్లో గొడవలు  
యశస్విని కార్డు చెల్లదని చెప్పడంతో గొడవలకు ది గుతున్న సంఘటనలు చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో చోటుచేసుకుంటున్నాయి. ఒక్కో ఆసుపత్రిలో నిత్యం 10 నుంచి 20 రోగులు యశస్విని కార్డులు పట్టుకుని వెళుతున్న దృశ్యాలు సర్వ సాధారణంగా మారింది. కానీ ప్రభుత్వ ఆసుపత్రి రెఫర్‌ చేయనిదే ప్రైవేటు ఆ సుపత్రుల్లో ఉచితంగా సేవలు అందించడం సాద్యంకాదని ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది అంటున్నారు. 

యశస్విని ఎంతో బాగుండేది
యశస్విని పథకంలో ఏపీఎల్, బీపీఎల్‌ కార్డుదారులకు ఒకేవిధంగా వైద్యసేవలు అందుబాటులో ఉండేవి. ఈ పథకం కింద ప్రతిరోగికి  రూ.2 లక్షల వరకు చికిత్స అయ్యే వ్యయాన్ని  ప్రభుత్వం భరించేది. కానీ ఆరోగ్యకర్ణాటక లో బీపీఎల్‌ కార్డుదారులకు మాత్రమే ఉచిత చికిత్స పొందవచ్చు. ఏపీఎల్‌ కార్డుదారులు (5 మంది ఉన్న కుటుంబం) ఏడాదికి రూ.1.5 లక్షల వరకు చికిత్స పొందే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్కరికి చికిత్స వ్యయం 30 శాతం మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. దీంతో మిగతా ఖర్చును రోగులే నెత్తినేసుకోవాలి. 

అందరికీ చికిత్స లభిస్తోంది  
‘అందరికీ చికిత్స అందిస్తున్నాం. ఎవరినీ వెనక్కి పంపించడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ అమల్లోకి వచ్చిన తరువాత చికిత్స అందించడం గురించి పూర్తి సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉంది’అని పీఎంఎస్‌ఎస్‌వై డైరెక్టర్‌ డాక్టర్‌ గిరిష్‌ తెలిపారు.  ‘ఆరోగ్య కర్ణాటక పథకంలో చాలా గందరగోళం ఉంది. దీని పట్ల ప్రైవేటు ఆసుపత్రులకు ఇంకా స్పష్టత లేదు’ అని ఫనా మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ నాగేంద్రస్వామి అన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top