పథకంలో భాగంగానే ముందే శివాజీ అమెరికాకు: రోజా

YSRCP MLA RK Roja Slams Chandrababu Over Attack On YS Jagan  Issue - Sakshi

హైదరాబాద్‌: గతంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ లేకపోయినా చంద్రబాబు నాయుడు తన మద్ధతు ఇచ్చి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇబ్బంది పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు సరైన రీతిలో దర్యాప్తు చేయడంలేదని, ఈ కేసులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని గవర్నర్‌ నరసింహన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కలగజేసుకుని థర్ట్‌ పార్టీ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన ప్రసాద రావు, ఆర్కే రోజా, మోపిదేవి వెంకటరమణ, కోన రఘుపతి, తదితరులు ఉన్నారు.

గవర్నర్‌ను కలిసిన అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా తొక్కేయడానికి వైఎస్సార్‌సీపీ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నా మొక్కవోని దీక్షతో ప్రజల్నే నమ్ముకుని నిలదొక్కుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో వైఎస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అంతమొందించాలని పక్కా ప్లాన్‌ చేసి హత్యాయత్నం చేశారని విమర్శించారు. టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడి కేసు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న గాయమంటూ కేసును తేలికగా కొట్టిపారేస్తున్నారని, కుట్ర కోణంలో విచారణ సాగకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసులో కీలక నిందితుడు హర్షవర్దన్‌ చౌదరీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, గంటా శ్రీనివాసరావులకు ఎంత సన్నిహితుడో అందరికీ అర్దమవుతోందన్నారు.

ఆపరేషన్‌ గరుడ పేరుతో నాటకం ఆడుతున్న శివాజీని అరెస్ట్‌ చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. పథకంలో భాగంగానే ముందే శివాజీ అమెరికా పారిపోయాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చరిత్ర అంతా హత్యా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లేనని, తనకు అడ్డుగా వస్తే పిల్లనిచ్చిన మామను కూడా అడ్డుతొలగించిన చరిత్ర బాబుదన్నారు. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన పెద్ద నాయకుల కాళ్లు పట్టుకుంటారని చంద్రబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రం నుంచి చంద్రబాబును తరిమికొట్టినప్పుడే తెలంగాణా, ఏపీ బాగుపడతాయని వ్యాఖ్యానించారు.

వైఎస్‌ జగన్‌ను చంపి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తనపై వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టిద్దామని అనుకున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌కు ప్రజలు, దేవుడిపై అపార నమ్మకం ఉందని, జగన్‌ను పార్టీ కార్యకర్తలే కాపాడుకుంటారని అన్నారు. ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగింది కాబట్టి తమకు సంబంధం లేదని చెబుతున్న టీడీపీ నేతలు.. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చినపుడు ఎయిర్‌పోర్టు రన్‌వే మీద ఎలా పోలీసులు అడ్డుకున్నారని సూటిగా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top