‘వెలగపూడి వీధి రౌడీలా ప్రవర్తించారు’

YSRCP MLA Gudivada Amarnath Fires On Velagapudi Ramakrishna Babu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : తాను ఎమ్మెల్యే కావడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వాదం, ప్రజల దీవెనలే కారణమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖ జిల్లాను టీడీపీ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అనకాపల్లి ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రౌడీల ప్రవర్తించారని ఆరోపించారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా అసభ్యకరంగా ఆయన మాట్లాడిన తీరు దారుణమని మండిపడ్డారు. దీనికి తగు చర్యలు తప్పక ఉంటాయని అన్నారు. వెలగపూడికి దమ్ముంటే జీవీఎంసీ ఎన్నికల్లో తన చేతలు చూపించాలని అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడిస్తామని అన్నారు.

అనకాపల్లి నియోజకవర్గ ప్రజలను టీడీపీ మోసం చేసిందని తెలిపారు. ప్యాకేజీ లీడర్లకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అవుతున్న వ్యక్తిపై పరుష పదజాలం వాడటం అతని సంస్కారానికి నిదర్శనమన్నారు. వెలగపూడికి రాజకీయంగా సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. విశాఖ భూముల కుంభకోణం సంగతి తెలుస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని.. కేంద్రంలోని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. కాగా, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీ నిర్వహించినందుకు వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంవీపీ జోన్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top