‘నయీమ్ ఎన్‌కౌంటర్ వెనుక చీకటికోణం’

The largest land scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగనంత అతిపెద్ద భూకుంభకోణానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావులు పాల్పడుతున్నారని కొడంగల్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ.. అసైన్డ్‌ భూములపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే హడావిడిగా అసెంబ్లీ సమావేశాన్ని ముగించారని తెలిపారు. లబ్దిదారులకు మేలు చేస్తున్నామన్న ముసుగులో ఆర్డినెన్స్ తేవాలని చూస్తున్నారని చెప్పారు. ఈ ఆర్డినెన్స్  ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల భూదందాకు తెరలేపిందన్నారు.

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తన ఆరోపణలపై స్పందించాలని సవాల్‌ విసిరారు. ఈ కుంభకోణంలో కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారని.. శంషాబాద్, మహేశ్వరం పరిసరాల్లో నాలుగు వేల ఎకరాల భూమి జూపల్లి చేతిలో ఉందని వెల్లడించారు. హెచ్‌ఎండీఏ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ రెగ్యులరైజ్ వ్యతిరేకించినందుకే బీఆర్ మీనాను బదిలీ చేశారని విమర్శించారు. రామేశ్వరరావుకు మేలు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. శంషాబాద్, మహేశ్వరం మండలంలో రామేశ్వరరావుకు భూములెన్ని ఉన్నాయో,  వాటిలో అసైన్డ్‌ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పాలని సూటిగా అడిగారు.

కేసీఆర్ తన చుట్టం జూపల్లి కోసం.. చట్టం తేవాలని చూస్తున్నారని రేవంత్‌ అన్నారు. సీఎం, ఆయన బంధువులపై తాను ఆరోపణలు చేస్తున్నానని.. ధైర్యముంటే తనపై కేసులు పెట్టుకోవచ్చునని సవాల్‌ విసిరారు. నయీమ్ ఎన్‌కౌంటర్ వెనక, ఈ భూమికి సంబంధించిన చీకటి కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం భూ దందాపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తనను రెచ్చగొట్టేందుకు తిట్ల కోసం కాకుండా.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్‌ నేతలను సూటిగా అడిగారు. నిషేధించిన చట్టాన్ని మార్చాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top