గులాబీ పార్టీలో ముసలం

Disputes In TRS Activists - Sakshi

టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ సమన్వయకర్తపై తిరుగుబాటు

జనగామ అధికార పార్టీలో దుమారం

చర్చనీయాంశంగా ‘ఇమ్మడి’ ఆరోపణలు

సాక్షి, జనగామ: జనగామ నియోజకవర్గంలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం మొదలైంది. ఒక వైపు సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. నేడో, రేపో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో.. అధికార పార్టీ నాయకులకు సొంత కార్యకర్తల నుంచే విమర్శలు ఎదురవుతుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని నర్మెట మండలానికి చెందిన పీఏసీఎస్‌ చైర్మన్, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగాపై తిరుగుబాటు ప్రకటించారు.

జనగామ ఎమ్మెల్యే చేత నియమితులై సమన్వయకర్తగా చెలామణి అవుతున్న నాయకుడు నాలుగేళ్లుగా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వారి బాగోగులు మరిచారని, నర్మెట ఎంపీపీ మరణిస్తే కనీసం పరామర్శకు సైతం రాలేదని తన వాట్సప్‌ పోస్టింగ్‌లో తెలిపారు. నాలుగేళ్లుగా కార్యకర్తలతో సమన్వయకర్త మీటింగ్‌లు పెట్టిన సందర్భాలు లేవని, ఎలక్షన్లు దగ్గరపడుతున్నాయని, ఇప్పటికైనా పార్టీని కాపాడాలని ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి కామెంట్‌ చేస్తూ పోస్టింగ్‌ చేశారు.

కాగా, శ్రీనివాస్‌రెడ్డి చేసిన పోస్టింగ్‌ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. నియోజకవర్గంలోనే సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్‌రెడ్డి పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలకు దిగడం టీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయి.

అధికార పార్టీలో అంతర్గత విభేదాలు పొడచూపుతుండడంతో నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి సంధించిన విమర్శలకు సొంత పార్టీలోని నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలపడం గమనార్హం. ఏదిఏమైనా అధికార పార్టీలో శ్రీనివాస్‌రెడ్డి చేసిన విమర్శలు టీఆర్‌ఎస్‌లోనే కాకుండా రాజకీయాల్లో వర్గాల్లో చర్చకు దారీతీస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top