
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు యూనివర్శిటీల్లో పీజీ స్థాయి మగ పిల్లలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారి క్లాసుకెళ్లి పాఠం చెప్పాలంటే భయమవుతుందంటూ మహిళా అధ్యాపకులు ప్రిన్సిపాల్ వద్దకెళ్లి మొరపెట్టుకునేవారు. అందుకు బాధ్యులైన ఆకతాయి విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరించడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరికలు చేసి పరిస్థితి చక్కదిద్దేవారు ప్రిన్సిపాల్. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.
యూనివర్శిటీ కళాశాలల్లో డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థినులను అధ్యాపకులే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. వారిపై డిపార్టుమెంట్ హెడ్‌లకు, ప్రిన్సిపాళ్లకు ఫిర్యాదులు చేసినా, విద్యార్థినీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రత్యక్ష ఆందోళనకు దిగినా బాధ్యులైన అధ్యాపకులపై ఎలాంటి చర్యలు ఉండడం లేదు. ఎందుకని ? ఇందులో కూడా రాజకీయాలు ఉన్నాయా? పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జాదవ్ యూనివర్శిటీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది.
కళాశాల కంపారేటివ్ లిటరేచర్ విభాగంలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థునులను లైంగికంగా వేధించారని, ఆయన్ని కళాశాల నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేయండంటూ ఏకంగా ఆదే విభాగానికి చెందిన డిగ్రీ, పీజీ స్థాయి ఐదు తరగతులకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా పై అధికారులు పట్టించుకోవడం లేదు. 2016, ఫిబ్రవరి నెలలో ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల గురించి తొలిసారి వెలుగులోకి వచ్చింది.
ఓ పీజీ విద్యార్థిని ధైర్యం చేసి తనను లైంగికంగా వేధించిన విషయాన్ని బయట పెట్టడంతో మరికొంత మంది విద్యార్థినులు కూడా తమను కూడా ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ తన ప్రవర్తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పుకొని ఏడాది పాటు సెలవుపై వెళ్లారు. మళ్లీ ఈ మార్చి నెలల్లో వచ్చి తన విధుల్లో చేరారు.
ఆయన క్లాసుకు హాజరవడం తమకు ఇబ్బందిగా ఉందని, ఆయన్ని కళాశాల నుంచే పంపించేయండంటూ విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌పై గత జూలై నెల నుంచి వారు డిమాండ్ చేస్తున్నా కళాశాల యాజమాన్యం ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. దాంతో కొందరు ఆయన చెప్పే ఆప్షనల్ సబ్జెక్టును కూడా మార్చుకున్నారు.
అలాంటి అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మీడియా వెళ్లి కళాశాల యాజమాన్యం ప్రశ్నించగా, ఇలాంటి వేధింపుల గురించి ఫిర్యాదులు చేయడానికి కళాశాలలో ఓ అంతర్గత కమిటీ ఉందని, ఆ కమిటీకి ఎలాంటి ఫిర్యాదు అందనందున తాము ఎలాంటి చర్య తీసుకోలేక పోతున్నామని యాజమాన్య వర్గాలు తెలిపాయి.
ఈ విషయాన్ని విద్యార్థిని విద్యార్థుల ముందు ప్రస్థావించగా, లైంగిక వేధింపులకు గురైన పీజీ విద్యార్థినులు తమను కోర్సును ముగించుకొని కళాశాల నుంచి వెళ్లిపోయారని, అందుకే ఫిర్యాదు చేయలేకపోయామని వారు చెప్పారు. ఈ విషయమై కళాశాలలో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం నాడిక్కడ సమావేశమైన విద్యార్థినీ విద్యార్థులు తమ ఆందోళనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.