నిర్మలమైన మనసులు

sakshi exclusive interview with super star krishna and late vijaya nirmala - Sakshi

కృష్ణగారు భర్తగా దొరకడం ఓ వరం నిర్మల ముక్కుసూటి మనిషి. అందుకే ఇష్టం... కృష్ణగారిది నిర్మలమైన మనసు... నిర్మలది మంచి మనసు... ‘సాక్షి’కి ఇచ్చిన ‘ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూస్‌’లో ఇలా  కృష్ణ, విజయ నిర్మల పలు విశేషాలు పంచుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి..

► కృష్ణగార్ని మొదటెక్కడ చూశారు?
విజయనిర్మల: మద్రాసులో ఓ సినిమా ఆఫీసులో చూశా. అది కూడా ఆయన అలా వెళ్తుంటే అద్దంలోంచి కనిపించారు. ఇంత అందగాడు ఎవరబ్బా? అనుకున్నా. మా సినిమాలో ఆయనే హీరో అని తెలిసి సంతోషమేసింది. అదే ‘సాక్షి’ సినిమా.

► ఆ సినిమా అప్పుడే ప్రేమలో పడ్డారు కదా?
అవును. ‘సాక్షి’లో చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తిలా ఆయన చేయాలి. ఆ యాక్టింగ్‌ నాకు చాలా నచ్చింది. కృష్ణగారి నవ్వు నాకు మరీ నచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ అప్పుడే నాకు కృష్ణగారంటే మనసులో ఓ ఇష్టం ఏర్పడింది. ఆ సినిమాలో మీసాల కృష్ణుడు టెంపుల్‌ సీన్‌ ఉంది. ఆ గుడిలో ఊరికే పెళ్లి చేసుకున్నా అది నిజమైపోతుందట. నాకు, కృష్ణగారికి ‘అమ్మ కడుపు చల్లగా. అత్త  కడుపు చల్లగా, కట్టగా కట్టగా తాళిబొట్టు కట్టగా.’ అని పాట ఉంటుంది. ఆ పాట పాడుతూ తాళిబొట్టు కట్టించుకుంటాను.  ‘ఇక మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు’ అని రాజబాబు ఏడిపించారు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో చేసే అవకాశం వచ్చింది. అబ్బాయిగారి దగ్గర అమ్మాయికి, అమ్మాయిగారి దగ్గర అబ్బాయిగారికి చనువు ఎక్కువ అయిపోయింది (నవ్వుతూ). నలుగురూ చెప్పుకునే ముందే మంచి రోజు చూసి పెళ్లి చేసేసుకుంటే బెటర్‌ అని, తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం.

► కృష్ణగారు బిడియస్తులు అనిపిస్తుంటుంది. అసలాయన మీకు ఎలా ప్రపోజ్‌ చేసి ఉంటారో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందికి ఉంది.
విజయ నిర్మల: ‘కృష్ణగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆయన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని చంద్రమోహన్‌ అడిగారు. ‘ఆయన ఇక్కడికి వచ్చి చెబితే చేసుకుంటాను, ఇలా పంపితే చేసుకోను’ అన్నాను. అప్పుడు ఆయనే వచ్చి ‘మనం పెళ్లి చేసుకుందాం’ అన్నారు.

► మే 31 కృష్ణగారి బర్త్‌డే. ఫిబ్రవరి 20 మీ బర్త్‌డే. మరి మీ మ్యారేజ్‌ డేట్‌ ఎప్పుడు?
విజయ నిర్మల: (నవ్వుతూ). డేట్‌ సరిగ్గా గుర్తులేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. కానీ ఇది (2018) 50వ సంవత్సరం.
కృష్ణ: 1969 మార్చి 24 మా పెళ్లి రోజు. మా పుట్టిన రోజులకు అభిమానులు ఫోన్‌ చేసి విషెస్‌ చెబుతారు. మ్యారేజ్‌ డేకి అయితే ఒకరోజు ముందే ఫోన్‌ చేసి, చెబుతారు (నవ్వుతూ).
విజయనిర్మల: ఆయనకి జ్ఞాపకశక్తి ఎక్కువ. అందుకే డేట్‌ చెప్పేశారు.

► ఇంతకీ కృష్ణగారిలో మీకు బాగా నచ్చిన అంశం?
విజయనిర్మల: చాలా మంచి వ్యక్తి. సున్నిత మనస్కుడు. తన పనేంటో తనేంటో అన్నట్లు ఉంటారు. అనవసరంగా ఒకర్ని నిందించడం, లేనిపోనివి మాట్లాడడం ఆయనకిష్టం ఉండదు. అది నాకు నచ్చింది. ఇక ఆయన అందానికి ఎవరైనా పడిపోతారు. చాలా హుందాగా ఉంటారు. ఆడపిల్లలతో  తల దించుకునే మాట్లాడేవారు. అది నాకు చాలా చాలా ఇష్టం. సేమ్‌ అదే మహేశ్‌బాబుకి వచ్చింది. తను కూడా ఆడవాళ్లు ఇబ్బందిపడేలా కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడటం వంటివి చేయడు. అప్పట్లో దాదాపు ప్రతి హీరోయిన్‌కీ కృష్ణగారంటే లవ్‌ ఉండేది. అయినా నాకు ఈర్ష్య అనిపించేది కాదు. ప్రేమిస్తే ప్రేమించుకోండి.. ఆయన మిమ్మల్ని చూస్తేనే కదా అనుకునేదాన్ని. ఒక హీరోయిన్‌ అయితే కృష్ణగారు అన్నం ముద్దలు కలిపి పెడితేనే తింటానని ఒకటే గోల. అలా చేస్తేనే షూటింగ్‌కు వస్తాను.. లేకపోతే రానని కండీషన్‌ పెట్టిందట. తినకపోతే తినకపోనీ షూటింగ్‌కి రాకపోతే ఏం.. అని నేను పంపించేదాన్ని కాదు. అంతక్రేజ్‌ ఉండేది ఆయనకు.

► కృష్ణగారు ఎంతోమంది అందమైన నాయికల సరసన నటించారు కదా. మిమ్మల్నే ప్రేమించడానికి కారణం ఏమిటంటారు?
విజయనిర్మల: దర్శకురాలైన తర్వాత నేను అందరితో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాను కానీ హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. షూటింగ్‌లో గ్యాప్‌ దొరికితే, నవల చదువుతూ కూర్చునేదాన్ని. నా పనేంటో నేనేంటో అన్నట్లుండేదాన్ని. కృష్ణగారు నన్నిష్టపడడానికి అదో కారణం అయ్యుంటుంది.

మీరెందుకు నచ్చారో ఆయన్ను అడిగారా?
విజయనిర్మల: ‘వంట బాగా చేస్తావు కాబట్టి ఇష్టం’ అన్నారు. ‘వంట కోసమే పెళ్లాడారా’ అంటే, ‘కాదు. నీ కళ్లంటే ఇష్ట’మని చెప్పారు.

► మీరు చేసే వంటల్లో కృష్ణగారికి బాగా నచ్చేవి?
విజయ నిర్మల: అన్నీ ఇష్టమే. ఆయన కోసం తందూరీ చేయడం నేర్చుకున్నా. ముఖ్యంగా నేను చేసే చేపల పులుసంటే ఆయనకు చాలా ఇష్టం. ‘నిర్మల చేసినట్లుగా ఎవరూ వంట చేయలేరు. ఆమె వంటలంటే నాకు చాలా ఇష్టం’ అని ఆయన అందరికీ చెబుతుంటారు. నాకెంత ఒంట్లో బాగాలేకపోయినా వంటలో నా చెయ్యి ఉండాల్సిందే. అప్పుడే ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ మధ్య నాకు చెయ్యి ఫ్రాక్చరై దాదాపు ఆరు నెలలు వంట చేయలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డా.

► మామూలుగా కృష్ణగారు భోజనప్రియులా?
విజయనిర్మల: ఒకప్పుడు! కానీ, ఇప్పుడు తిండి తగ్గిపోయింది.

► కృష్ణగారి మొదటి భార్యతో మీ అనుబంధం?
విజయనిర్మల: మేమిద్దరం బాగానే ఉంటాం. ఓరకంగా క్లోజ్‌ఫ్రెండ్స్‌ అనొచ్చు. ఆవిడ మా ఇంటికి భోజనానికి వస్తుంది. నేను వాళ్లింటికి వెళతాను. ఆవిడ పుట్టినరోజుకు కేక్‌ తీసుకెళతాం. పిల్లలందరికీ నేనంటే ఇష్టం. నన్ను ‘పిన్నీ’ అని పిలుస్తారు. నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు.

► డ్రెస్సింగ్, మేకప్‌ విషయంలో కృష్ణగారు మీకేమైనా ఆంక్షలు పెట్టేవారా?
విజయనిర్మల: లేదు. ‘నీకు సౌకర్యంగా ఉన్న డ్రెస్‌లు వేసుకో’ అంటారు. పాత్రకు అనుగుణంగా డ్రెస్‌ ఉండాలంటారు. హెయిర్‌ స్టయిల్‌ విషయంలో మాత్రం కామెంట్‌ చేసేవారు. ఒకప్పుడు జుట్టును ఇంతెత్తున చేసి, ముడిలా వేసేవాళ్లు. ఆ స్టయిల్‌ చేసుకున్నప్పుడు ‘ఇదేంటి పిచ్చుక గూడులా ఉంది. బాగా లేదు’ అనేవారు (నవ్వుతూ).

► కృష్ణగారితో మీకు అనుబంధం పెరిగిన తర్వాత జరుపుకొన్న మీ తొలి పుట్టినరోజుకు ఆయన ఏం బహుమతి ఇచ్చారు?
విజయ నిర్మల: మా మధ్య ప్రేమ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజుకి గడియారం కొనిపెట్టారు. ప్యాక్‌ విప్పి చూసిన నాకు నవ్వాగలేదు. అది టేబుల్‌ క్లాక్‌. ఇష్టంగా ఇచ్చారు కాబట్టి, ఆ గడియారాన్ని చాలా ఏళ్లు పదిలంగా కాపాడుకున్నా. కృష్ణగారు బంగారు నగలు ఇష్టపడరు. ఎలాంటి కానుకలు కొనిపెట్టాలో మాత్రమే కాదు.. ఎలాంటి డ్రెస్సులేసుకోవాలో కూడా ఆయనకు తెలియదు.

► సూపర్‌స్టార్‌ డ్రెస్‌లన్నీ మీ సెలక్షన్‌ అన్నమాట?
విజయనిర్మల: అవును. సినిమాల కోసం  కాస్ట్యూమర్స్‌ సెలక్ట్‌ చేస్తారు. కానీ, విడిగా వేసుకునే బట్టలు మాత్రం నేనే  కొంటాను.

► మీ మధ్య చిన్న చిన్న అలకలు.. గొడవలు..?
విజయ నిర్మల: సంసారమన్నాక అలకలు కామన్‌. అయితే విడిపోయేంత గొడవలు ఎప్పుడూ రాలేదు. చెప్పిన టైమ్‌కి ఇంటికి రానప్పుడు, కోపం ప్రదర్శించేదాన్ని. కాసేపు మాట్లాడుకోకపోయినా, తర్వాత మామూలైపోతాం.

► మీ ఇద్దరికీ ఇప్పుడు కావాల్సినంత సమయం దొరికింది. మరి, ఎలా గడుపుతున్నారు?
విజయ నిర్మల: రోజూ పేపర్లు తిరగేస్తాం. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్‌ చూస్తాం. క్రికెట్‌ మ్యాచ్‌ అప్పుడు మాత్రం ఆయనో టీవీ, నేనో టీవీ చూస్తాం. యాక్ట్‌ చేస్తున్నప్పుడు సెట్లోనూ టీవీ పెట్టుకునేవారు కృష్ణగారు. క్రికెట్‌ ఆయనకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి సినిమాలు చేసినప్పుడు మాత్రం పేకాట ఆడేవాళ్లం. ఎప్పుడూ ఆయనే విన్నర్‌.

► ఎప్పుడైనా సరే మీ ఇద్దరూ పిల్లలు కావాలని కోరుకున్నారా? వద్దనుకున్నందుకు బాధపడ్డారా?
విజయ నిర్మల: మేమే వద్దనుకున్నాం. ఆల్రెడీ మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ మేం పిల్లల్ని కంటే ఆల్రెడీ ఉన్న పిల్లలు ‘మీవాళ్లు.. మావాళ్లు’ అనే విభేదాలు వస్తాయి. అసలు బిడ్డలే లేకుంటే అందర్నీ మన బిడ్డలు అనుకోగలం కదా. అందుకే ఆనందంగానే వద్దని డిసైడ్‌ అయ్యాం. బాధ అనిపించలేదు.

► కృష్ణగారు మీ భర్త కావడం వరం అనుకుంటారా?
విజయ నిర్మల: కచ్చితంగా. ఒక మంచి జీవిత భాగస్వామి లభించడం తేలిక కాదు. భార్యలను హింసించే భర్తల కథలు సినిమాల్లో చూస్తున్నాం. విడిగా కూడా అలాంటి భర్తలు చాలామందే ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నా జీవితం చాలా ఆనందంగా ఉంది. కృష్ణగారు మేలిమి బంగారం.

► అప్పట్లో కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్‌ అంటే క్రేజ్‌. మీ ఇద్దరూ కలసి ఎక్కువ సినిమాలే చేశారు కదా?
కృష్ణ: మా పెళ్లి కాకముందే వరుసగా ఓ 20 సినిమాలు చేశాం. ఒక సంవత్సరానికి పది సినిమాలు వస్తే 8 సినిమాల్లో నాతో తనే ఉండేది. మా కాంబినేషన్‌ బాగుండేది. అందుకని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా మమ్మల్ని తీసుకునేవారు.

► ఎక్కువ సినిమాలు చేసిన లేడీ డైరెక్టర్‌గా విజయనిర్మలగారు గిన్నిస్‌ రికార్డ్‌ సాధించారు. ఆమె కెరీర్‌ విషయంలో మీ ప్రోత్సాహం గురించి?
కృష్ణ: అంతా తన కష్టమే. ‘ఈ సినిమా చేయబోతున్నాను’ అంటే ‘సరే’ అనేవాణ్ణి. ప్రతి సినిమా డీటైల్‌గా బాగా తీసేది. ఒకటీ రెండు సినిమాలు ఆడకపోవచ్చు కానీ ఆల్మోస్ట్‌ అన్ని సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. తన నరేషన్‌ కూడా బావుంటుంది. షాట్స్‌ కూడా బావుంటాయి.

► విజయ నిర్మలగారి డైరెక్షన్‌లో యాక్ట్‌ చేసినప్పుడు మీకెలా అనిపించేది?  
కృష్ణ: అందరి డైరెక్టర్స్‌తో ఎలా పని చేశానో తన సినిమాకీ అలానే చేశాను. డైరెక్ట్‌ చేస్తున్నది మా ఆవిడ అని సలహాలివ్వడానికి ట్రై చేయలేదు.

► విజయ నిర్మలగారి డైరెక్షన్‌లో చేసిన సినిమాల విషయంలో ఎప్పుడైనా ఇబ్బంది ఎదురైందా?   
కృష్ణ: ‘దేవదాసు’ సినిమా అప్పుడు కొంచెం డైలమాలో పడ్డాం. ఆ పిక్చర్‌ నాలుగు గంటలు ఉంటుంది. అన్ని గంటలు ఎవరూ చూడరు.. కట్‌ చేయండని  డిస్ట్రిబ్యూటర్స్‌ అడిగితే మాకు ఎక్కడ కట్‌ చేయాలో తోచలేదు. ఆదుర్తి సుబ్బారావు, ఎల్వీప్రసాద్‌ వంటి దర్శకులకు షో వేసి చూపించాం. సినిమా చూసి ఎల్వీ ప్రసాద్‌గారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. పుల్లయ్యగారు మాత్రం ఎవడాడు? కట్‌ చేయమంది? అన్నారు. బ్రహ్మాండంగా ఉందన్నారు. నేను సినిమా చూసి ఏడవడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ అని ఆదుర్తి సుబ్బారావుగారు అన్నారు. ఎల్వీ ప్రసాద్‌గారు నేను ‘నీ ఫ్యాన్‌ అయిపోయాను’ అని విజయకు కాల్‌ చేశారు.

► దర్శకురాలిగా చాలా త్వరగా సినిమాలు పూర్తి చేస్తారనే పేరు ఆమెకి ఉంది?   
కృష్ణ: అవును. ఓ సినిమాకి శివాజీ గణేశన్‌గారివి 30 రోజులు డేట్స్‌ తీసుకున్నాం. కానీ 20 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేసేశాం. ఆయన గొడవ. మిగతా పది రోజులు నేనేం చేయాలి అని. నాగేశ్వరరావుగారు కూడా అదే అనేవారు.

► విజయ నిర్మలగారిలో ఉన్న స్పెషల్‌ క్వాలిటీ ఏంటి? ఆమెను ఎందుకు ఇష్టపడ్డారు?
కృష్ణ: తను చాలా కామ్‌ పర్సన్‌. దానికి తగ్గట్టు ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్‌. ఆర్టిస్ట్‌గా కానీ డైరెక్టర్‌గా కానీ తనకు వర్క్‌ మీద చాలా కమాండ్‌ ఉంది. మనిషి కూడా ఫ్రాంక్‌గా ఉంటుంది. ముక్కుసూటితనం ఇష్టం.    
         
► కృష్ణగారు మీ చీరలు సెలెక్ట్‌ చేస్తారా?
విజయనిర్మల: చేయరు. కానీ బాగా డ్రెస్‌ చేసుకుంటే బావుంది అని మాత్రం కాంప్లిమెంట్‌ ఇస్తారు. లేదంటే అప్పలమ్మలా ఉన్నావు అంటారు. జడ వేసుకోకుండా ముడి వేసుకుంటే పిచ్చుకగూడు, కాకి గూడు అని సరదాగా అనేవారు.

► కృష్ణగారి బయోపిక్‌ తీస్తే ఒప్పుకుంటారా?
విజయ నిర్మల: అలాంటి మనిషి దొరకాలి కదా. ఇమిటేట్‌ చేయొచ్చు. కానీ కృష్ణగారిని ఇమిటేట్‌ చేయడం కష్టం. ఆ అందం ఎవరికీ రాదు. ఆయన సాఫ్ట్‌నెస్‌ ఎవరికీ రాదు. చేస్తే మహేశ్‌ చేయాలి. మహేశ్‌ కూడా చాలా ఫాస్ట్‌. సెట్లో చాలా జోక్స్‌ వేస్తుంటాడు. కృష్ణగారికి జోక్‌ వేయడం కూడా రాదు. అలా దూరంగా ఉండిపోతారు.


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top