మా మంచి పనులు కొనసాగిస్తూనే ఉండాలి

MAA Introducing New Scheme For Poor Artists - Sakshi

కృష్ణ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) డైరీ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, శ్యామల దంపతులు సంయుక్తంగా ‘సిల్వర్‌ జూబ్లీ డైరీ – 2019’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘మా’ మెంబర్స్‌లో పేద కళాకారుల ఇంటి ఆడపిల్లలకు ‘మా కల్యాణ లక్ష్మి’, ‘మా విద్య’ పథకాలను స్టార్ట్‌ చేస్తున్నట్లు ‘మా’ బృందం పేర్కొంది. ఈ పథకానికి విజయనిర్మల లక్షా యాభై వేల రూపాయలు, శ్యామల లక్ష రూపాయిలు విరాళం అందించారు.

కృష్ణ మాట్లాడుతూ – ‘‘మా’ ఇలాంటి మంచి పనులు కొనసాగించాలి. అసోసియేషన్‌ సొంత బిల్డింగ్‌ నిర్మాణం జరగాలి’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘కృష్ణ, కృష్ణంరాజు అంటే ఇండస్ట్రీ తొలినాళ్లలో మూల స్తంభాలు. నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారంటే డబ్బులు తీసుకోకుండా వాళ్లకు సినిమాలు చేశాం. కృష్ణగారు ఫిల్మ్‌ కొనిచ్చి సహాయం చేస్తే, నేను భోజనాలు పెట్టించేవాణ్ణి. వర్గబేధాలు లేకుండా సమస్యలు పరిష్కరించాం. ‘మా’ సంస్థ చాలా మందికి ఉపయోగపడుతోంది.

ఇంకా బాగా కొనసాగాలి. అలాగే ఓ మంచి ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ బిల్డింగ్‌ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది’’ అన్నారు. ‘‘ఈ కార్యక్రమం పెళ్లిలా జరిగింది. చాలా సంతోషంగా ఉంది’’ అని విజయనిర్మల అన్నారు. ‘‘ఒకే వేదిక మీద కృష్ణ, కృష్ణంరాజుగారిని సన్మానించడం గర్వంగా ఉంది. విజయనిర్మలగారు అద్భుతమైన సినిమాలు తీసి రికార్డ్‌ సృష్టించారు. ఆవిడను మనందరం సన్మానించుకోవాలి’’ అని శ్యామల అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం 33మంది కళాకారులకు 3000 చొప్పున ఫించను ఇస్తున్నాం.

జనవరి నుంచి 5000 ఇవ్వాలనుకుంటున్నాం.‘మా కల్యాణ లక్ష్మి’ ద్వారా 1,16,000 రూపాయలు అర్హులకు అందిస్తాం. ‘మా విద్య’ ద్వారా లక్ష రూపాయిలు అందిస్తాం. త్వరలోనే లండన్‌లో ఓ ఈవెంట్‌ చేయనున్నాం’’ అన్నారు. ‘‘అపోలో హాస్పిటల్స్‌ 14 లక్షలు స్పాన్సర్‌షిప్‌ అందించింది. విజయనిర్మలగారు ప్రతి పుట్టిన రోజుకు డొనేషన్‌ ఇస్తుంటారు. ప్రతి నెలా 15వేలు పంపుతున్నారు’’ అన్నారు ప్రధాన కార్యదర్శి నరేశ్‌. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top