వీళ్ల గుండెజారి గల్లంతయ్యిందా? | heroines real life love stories ! | Sakshi
Sakshi News home page

వీళ్ల గుండెజారి గల్లంతయ్యిందా?

Feb 24 2014 11:51 PM | Updated on Oct 30 2018 5:58 PM

ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో మహా మహా శాస్త్రవేత్తలే పరిశోధించినా చెప్పలేని అంశం. నిజంగానే ప్రేమంటేనే ఓ మాయ.

 ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో మహా మహా శాస్త్రవేత్తలే పరిశోధించినా చెప్పలేని అంశం. నిజంగానే ప్రేమంటేనే ఓ మాయ. అదో కొత్త ప్రపంచం కూడా. రీల్‌పై ఎన్నో ప్రేమకహానీలు నడిపే కథానాయికలు, రియల్ ప్రేమను ఎలా ఆస్వాదిస్తారు? ఇటీవలికాలంలో అగ్రకథానాయికల రియల్ లవ్ స్టోరీలకు వెబ్‌సైట్స్‌లో అగ్రతాంబూలం దక్కుతోంది. అసలు వీరి ప్రేమ నిజమేనా? నిజానిజాల సంగతి పక్కనపెడితే వీళ్ల ప్రేమకహానీలు మాత్రం యూత్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఆ కబుర్లలోకి వెళ్తే...
 
 ఈ ప్రేమ ఎందాకా?
 ‘ఇలియానా చిట్టి బెల్లియానా...’ అనే పాట చాలామంది పాడుకునే ఉంటారు. ఇలియానా అందం ఎక్కడుందీ అంటే ‘నడుము’ అని ఎవరైనా చెబుతారు. ఈ స్లిమ్ సుందరి నాభి సౌందర్యానికి మనసు పారేసుకున్నవారు బోల్డంత మంది ఉన్నారు. కానీ, ఇల్లూ బేబీ మాత్రం ఓ తెలుగు హీరోకి మనసిచ్చేసింది. అతనితోనే మూడు ముళ్లు వేయించుకోవాలనుకుంది. అయితే, మోసం చేశాడట. అందుకే విడిపోయింది.
 
పేరు చెప్పకుండా, ఓ హీరో తనను మోసం చేశాడని ఆ మధ్య బహిరంగంగా చెప్పింది ఇలియానా. ఈ చేదు అనుభవంతో ప్రేమకు దూరంగా ఉంటుందేమోనని కొంతమంది భావించారు. కానీ, ఇలియానా మళ్లీ మనసు పారేసుకుంది. ఈసారి ఈ బ్యూటీ మనసు దోచుకున్నది  ఓ ఆస్ట్రేలియన్ అని సమాచారం. పేరు ఆండ్రూ. కాఫీ షాప్స్, షాపింగ్ మాల్స్ అంటూ ముంబయ్‌లో ఎక్కడ చూసినా ఈ జంటేనట. ఒకవేళ ఈ లవ్‌స్టోరీ నిజమైతే.. ఇదైనా పెళ్లి పీటల వరకు వెళుతుందో లేదో చూడాలి. 
 
 దుబాయ్‌లో ప్రేమికుల దినోత్సవం.. పెళ్లి?
 ఇంట్లో పెద్దవాళ్లకి పెళ్లయితే, ఆ తర్వాతి వాళ్లకి లైన్ క్లియర్ అయినట్లే. కానీ, కాజల్ అగర్వాల్ విషయంలో ఇది రివర్స్. ముందు తన చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లయ్యింది. ఒకప్పుడైతే, ‘చెల్లి పెళ్లయ్యింది. అక్కకేంటి ప్రాబ్లమ్’ అనుకునేవారు. కానీ, మోడ్రన్ యుగంలో ఆ సమస్య లేదు.
 
నిషాకి నచ్చినవాడు దొరకడంతో పెళ్లి పీటల మీద కూర్చుంది. కాజల్‌కి కూడా పెళ్లంటే చాలా గౌరవం. ప్రేమ పెళ్లి చేసుకుంటే తన తల్లిదండ్రులు కాదనరు. ఎందుకంటే, నిషాది కూడా లవ్ మేరేజే కదా. మీ చెల్లెలి పెళ్లయ్యింది కదా.. మీ పెళ్లెప్పుడు? అని కాజల్‌ని అడిగితే.. ఇంకా టైముందని చెబుతూ వస్తోంది.  అయితే, ఇటీవలే తను ప్రేమలో పడిందనే వార్త ప్రచారంలో ఉంది. ముంబయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తకు మనసిచ్చిందట కాజల్. ఈ ఇద్దరూ ప్రేమికుల దినోత్సవాన్ని దుబాయ్‌లో జరుపుకున్నారని సమాచారం.
  మరి.. పెళ్లెక్కడ చేసుకుంటారో?
 
 అతి త్వరలో...!
 అసలు వీరిద్దరి మధ్య ఉన్నది ప్రేమా స్నేహమా..? అని సిద్ధార్ధ్, సమంత వ్యవహారం తెలియక చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ‘జబర్దస్త్’ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారనే వార్త వచ్చింది. చాలామంది చెప్పినట్లుగానే ‘అదేం లేదు’ అని తేల్చి చెప్పింది ఈ జంట. కానీ, జాయింట్‌గా చూసినప్పుడు మాత్రం  ఇద్దరి కెమిస్ట్రీ ‘లవ్’లో పడ్డారనే సంకేతాన్ని అందజేస్తోంది. ముఖ్యంగా లక్స్ సబ్బు ప్రకటనలో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. నిజమైన ప్రేమికులు కాబట్టే, కెమిస్ట్రీ పండిందని చెప్పుకుంటున్నారు. అంతకు ముందు కాళహస్తిలో కలిసి పూజలు చేయడంతో... డౌటే లేదు. ప్రేమించుకుంటున్నారని చాలామంది ఫిక్స్ అయ్యారు. ‘సిద్ధూ నా స్నేహితుడు మాత్రమే’ అని చెప్పుకుంటూ వస్తోంది సమంత. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతమంది భావిస్తున్నారు.
 
 లిఫ్ట్‌లో ముద్దుల కేళీ?
 తమన్నా సినిమాల్లోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. ఇప్పటివరకు బోల్డన్ని ప్రేమకథా చిత్రాల్లో నటించింది. కానీ, నిజజీవితంలో హీరో కార్తీతో మాత్రమే ఎఫైర్ సాగించిందనే వార్త మూడునాలుగేళ్ల క్రితం హల్‌చల్ చేసింది. చివరకు కార్తీకి పెళ్లవడంతో ఆ వార్తకు ఫుల్‌స్టాప్ పడింది. తాజాగా మరోసారి తమన్నా లవ్‌టాక్‌లో నిలిచింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్నవాటిలో హిందీ చిత్రం ‘హమ్‌షకల్స్’ ఒకటి. ఈ చిత్రదర్శకుడు సాజిద్‌ఖాన్‌తో తమన్నా ప్రేమలో పడిందని బాలీవుడ్ టాక్. ఈ ఇద్దరూ లొకేషన్లో పరిసర ప్రాంతాలను మర్చిపోయి మరీ కబుర్లు చెప్పుకుంటున్నారట. లిఫ్ట్‌లో సాజిద్‌కి తమన్నా ముద్దులు పెడుతూ నలుగురి దృష్టిలో పడిందనే వార్త కూడా ఉంది. ఈ ఎఫైర్ గురించి తమన్నాని ఎవరో అడిగితే, ఫైర్ అయ్యిందని వినికిడి. ఫ్రెండ్లీగా ఉంటే ఎఫైర్ అంటగడతారా? అన్నట్లు మాట్లాడుతోందట. నిజమేంటో తమన్నాకే ఎరుక.
 
 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమలో పడ్డ తారల జాబితా చాలానే ఉంది. ఆ మధ్య ఓ యువహీరోతో త్రిష ప్రేమలో పడిందని, ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనీ వార్త వచ్చింది. కానీ, ఇద్దరూ మాటామాటా అనుకుని విడిపోయారట. ఇక, శింబూతో ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టిన తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమలో పడటం, పెళ్లి వరకు వెళ్లిన తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. శింబూతో ప్రేమలో పడ్డానని బహిరంగంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించిన కొన్ని నెలలకే హన్సిక అతన్నుంచీ విడిపోయింది. కానీ, తమ ప్రేమకు ఈ ఇద్దరూ ఫుల్‌స్టాప్ పెట్టలేదని, కామా మాత్రమే పెట్టారనే వార్త కూడా ఉంది. ఏదేమైనా సినిమా తారలు ఏం చేసినా వార్తే. మరీ... ముఖ్యంగా వాళ్ల ఎఫైర్లకు సంబంధించిన వార్తలు మాత్రం భలే మజానిస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement