ఫోర్ ఇన్ వన్.. | Sakshi
Sakshi News home page

ఫోర్ ఇన్ వన్..

Published Thu, Oct 30 2014 3:20 AM

ఫోర్ ఇన్ వన్..

ఇదో వినూత్న వాటర్‌క్రాఫ్ట్. పేరు కార్మోరన్. ఇది ఫోర్ ఇన్ వన్ అన్నమాట. అంటే దీన్నొక్కదాన్ని కొంటే మనం కేటమారన్, ట్రైమారన్, మోనోహాల్, హైడ్రోఫాయిల్ కొనాల్సిన పని లేదు. ఇవన్నీ ఏమిటి అనుకుంటున్నారా? ఇవి వాటర్‌క్రాఫ్ట్స్‌లో రకాలు. కార్మోరన్ ఒక్కటే ఇలా అన్ని రకాలుగా మారిపోతుంది. అదీ ప్రయాణిస్తుండగానే..! 1,500 కిలోల బరువుండే ఈ హైటెక్ వాటర్‌క్రాఫ్ట్ బటన్లు నొక్కుతున్న కొద్దీ.. మూడు నాలుగు రకాల బోట్లులాగా మారిపోతుంది. హైడ్రోఫాయిల్ మోడ్‌లో బోటు గాల్లో ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది. కింద ఉండే హైడ్రోఫాయిల్స్ తెరుచుకుని.. బోటును కొంచెం పైకి లేపుతాయి.

ఈ లగ్జరీ బోటును ఆస్ట్రియాకు చెందిన కార్మోరన్ కంపెనీ తయారుచేసింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కార్మోరన్‌లో ముగ్గురు ప్రయాణించొచ్చు. అంతేకాదు.. దీన్ని సన్‌బాతింగ్‌కు అనువుగా చకచకా మార్చేసుకోవచ్చు కూడా. కార్మోరన్‌లోని ప్రధాన భాగాన్నంతా కార్బన్ ఫైబర్‌తో తయారుచేశారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ వినూత్న బోటు ధరను ఇంకా ప్రకటించలేదు.
 
 

Advertisement
Advertisement