
మళ్లీ మంటపెట్టి రెచ్చగొట్టిన పాకిస్థాన్
పుండుమీద కారం చల్లినట్లుగా పాకిస్థాన్ మరో విషయం ప్రకటించింది. ఇప్పటికే కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నంత పరిస్థితి కనిపిస్తుండగా దానికి మరింత ఆజ్యం పోసేలాగా మరో ప్రకటన చేసింది.
న్యూఢిల్లీ: పుండుమీద కారం చల్లినట్లుగా పాకిస్థాన్ మరో విషయం ప్రకటించింది. ఇప్పటికే కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నంత పరిస్థితి కనిపిస్తుండగా దానికి మరింత ఆజ్యం పోసేలాగా మరో ప్రకటన చేసింది. తాము మరో ముగ్గురు భారత గుఢాచారులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)నే లక్ష్యంగా చేసుకొని గూఢచర్యం నిర్వహిస్తున్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేశామని పాక్ తెలిపినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. ‘మేం ఖలీల్, ఇంతియాజ్, రషీద్ అనే ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశాం.
ఈ ముగ్గురు కూడా భారత్ ఇంటెలిజెన్స్ సంస్థ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) నుంచి జీతభత్యాలు పొందుతున్నవాళ్లే’ అని పాక్ పోలీసులు ప్రకటించారు. వీరు ముగ్గురు కొత్త కొత్త లక్ష్యాలు ఎన్నుకున్నారని, వాటిల్లో రావల్‌కోట్‌లోని మిలటరీ ఆస్పత్రి, సీపీఈసీ నిర్వహిస్తున్న ప్రాజెక్టులు, చైనా కీలక ఇంజినీర్లు, సున్నితమైన ఏర్పాట్లకు సంబంధించిన రహస్యాలు తెలుకునేందుకు తాము అరెస్టు చేసిన ఈ ముగ్గురు గూఢచర్యం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.
భారత రా అధికారులు రంజీత్, మేజర్ సుల్తాన్, మరో అధికారి ఈ అరెస్టయిన వారితో టచ్‌లో ఉంటూ పనులు చక్కబెట్టించుకున్నారని కూడా పాక్ ఆరోపించింది. వీరు ఎన్నోసార్లు నియంత్రణ రేఖను దాటి భారత ఆర్మీ, రా అధికారులు నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారని కూడా పాక్ పేర్కొంది. గత ఏడాది అబ్బాస్పూర్‌లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో కూడా వీరు ముగ్గురు నిందితులని భారీ ఆరోపణలు చేసింది.