భద్రతకు పెద్దపీఠ | Women and Child Expo | Sakshi
Sakshi News home page

భద్రతకు పెద్దపీఠ

Mar 5 2017 1:45 AM | Updated on Sep 5 2017 5:12 AM

భద్రతకు పెద్దపీఠ

భద్రతకు పెద్దపీఠ

నేరరహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చేందుకు అడుగులు వేస్తున్న పోలీసులు మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు.

ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఎక్స్‌పో స్టాళ్ల ద్వారా అవగాహన
ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ...
నేడు షీ టీమ్స్‌ 5కే రన్‌


సిటీబ్యూరో: నేరరహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చేందుకు అడుగులు వేస్తున్న పోలీసులు మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. షీ టీమ్స్‌ ఏర్పాటుచేసి పోకిరీల ఆటకట్టిస్తున్న పోలీసులు సమాజంలో నేర నిర్మూలన కోసం తామేమి చర్యలు తీసుకుంటున్నామో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ‘ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఎక్స్‌పో’లో ఏర్పాటుచేసిన స్టాళ్ల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ఆదివారంతో ముగియనున్న ఈ ఎక్స్‌పోలో షీ టీమ్స్, హాక్‌ఐ, చైల్డ్‌ హెల్ప్‌లైన్, పునర్జన్మ (లేక్‌ పోలీసులు), సైబర్‌ క్రైమ్, భరోసా తదితర స్టాళ్లను ఏర్పాటుచేశారు. వీటిని నగరవాసులు సందర్శిస్తూ పోలీసులు చేస్తున్న చర్యల గురించి తెలుసుకుంటున్నారు.

‘షీ టీమ్స్‌’ అండగా...
‘బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కాలేజీలు, కార్యాలయాలు... ఇలా ఏ చోటైనా వేధింపులకు గురైతే పోలీసుల దృష్టికి తీసుకురండి. ఎస్‌ఎంఎస్‌ పెట్టినా, వాట్సాప్‌ చేసినా, ఫేస్‌బుక్‌ ద్వారా ఫిర్యాదు చేసినా బాధితులకు అండగా షీ టీమ్‌ రంగంలోకి దిగుతుంది. పోకిరీలు చేస్తున్న వేకిలిచేష్టలను వీడియోలతో చిత్రీకరించి మరీ పట్టుకొని తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్‌ చేస్తోంది. మరోసారి ఈవ్‌టీజింగ్‌ చేయకుండా హెచ్చరించి వదిలేస్తోంది. ఒకవేళ పునరావృతం చేస్తే నేరుగా జైలుకెళ్లేలా చూస్తుంద’ని షీ టీమ్‌ సభ్యులు స్టాల్‌ను సందర్శించేందుకు వచ్చిన వారికి వివరిస్తున్నారు.

బాధితులకు ‘భరోసా’గా...
గృహహింస, లైంగిక వేధింపులకు గురయ్యే వారు.. ఇలా వీరందరికీ సిటీ పోలీసులు గతేడాది ప్రారంభించిన ‘భరోసా’ కేంద్రం అండగా ఉంటోంది. ‘లైంగిక దాడికి గురైన మహిళలు, వేధింపులకు గురయ్యే పిల్లలకు వైద్య, న్యాయ సహాయం అందిస్తున్నాం. కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నామ’ని చెబుతున్నారు భరోసా స్టాల్‌ నిర్వాహకులు. వేధింపులకు గురికాకుండా పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు లైంగిక వేధింపులకు గురైన బాలలను గుర్తించడానికి తల్లిదండ్రులకు సూచనలు కూడా ఇస్తున్నారు. ఇటు మహిళలు, అటు పిల్లలకు అందిస్తున్న భరోసాను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

‘హాక్‌ ఐ’తో మహిళల జర్నీ సేఫ్‌...
నేరాల అదుపులో పౌరులూ పోలీసు బాధ్యతలు నిర్వహించడానికి వీలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘హాక్‌ ఐ’ మొబైల్‌ యాప్‌ ద్వారా నగర పోలీసు వ్యవస్థ నిరంతరం అందుబాటులో ఉంటుందని అంటున్నారు స్టాల్‌ నిర్వాహకులు. ‘ప్రయాణ సమయాల్లో మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు ఉమెన్‌ ట్రావెల్‌ మేడ్‌ సేఫ్‌ అనే అప్షన్‌ను ఈ యాప్‌లో ఉంచాం. మహిళలు తాము ప్రయాణించే ట్యాక్సీ, క్యాబ్, ఆటో, బస్సు, రైలు ఎక్కేముందు దాని ఫొటో లేదా వీడియో తీసి దీని ద్వారా పంపవచ్చు. లేదంటే వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్, ఎక్కిన ప్రదేశానికి గమ్యస్థానం సంబంధించిన వివరాలు జతచేయాలి. ప్రయాణ సమయంలో ఎదురైన ఇబ్బందులను కూడా తెలియజేయవచ్చ’ని సందర్శకులకు వివరిస్తున్నారు. హాక్‌ ఐ యాప్‌లో ఉన్న అన్ని అప్షన్లు గురించి తెలియజేస్తున్నారు.

చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ‘1098’
నేటి కాలంలో బాలలు చాలా మంది తప్పిపోతున్నారు. వేధింపులకు గురువుతున్న సందర్భాలున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు కోప్పడ్డారని ఇంటిని వదిలిపోతున్న బాలలు ఉన్నారు. ఇతరుల మాయమాటలు నమ్మి అక్రమరవాణాకు గురవుతున్న పిల్లలు ఉన్నారు. తమ ఇంట్లో వారి బలవంతంతో లేదా ఆర్థిక పరిస్థితుల కారణంగానో బాల కార్మికులుగా పనిచేస్తున్నవారు మీ కంటకనబడుతుంటారు. సంరక్షణ, రక్షణ అవసరమైన బాలలు... ఇలా ఎవరూ కనిపించినా చైల్డ్‌లైన్‌ సహాయ కేంద్రం 1098’కి ఫోన్‌ చేయాల’ని చైల్డ్‌లైన్‌ ఉద్యోగులు చెబుతున్నారు. 24 గంటల పాటు ఈ నంబర్‌కు కాల్‌ చేయవచ్చని సూచిస్తున్నారు.

‘పునర్జన్మ’ బాగుంది...
కుటుంబ కలహాల కారణంతో, పరీక్షల్లో ఫెయిల్‌ అయినప్పుడూ, అనారోగ్యం కారణంగా... ఇలా వివిధ కారణాలతో ఎంతో మంది మహిళలు ఆత్మహత్య చేసుకునేందుకు ట్యాంక్‌బండ్‌ పైనుంచి హుస్సేన్‌సాగర్‌లోకి దూకిన సందర్భాలు ఉన్నాయి. సాగర్‌లోకి దూకి మరీ వారిని రక్షించి వారికి జీవితంపై ఆశ కలిగించేలా కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు లేక్‌ పోలీసులు. ఇలా ఎంతో మందికి పునర్జన్మ కల్పించిన లేక్‌ పోలీసులు ఏర్పాటుచేసిన స్టాల్‌ ఆలోచింపజేస్తోంది.

నేడు షీటీమ్స్‌ 5కే రన్‌..
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కాలేజీలు, కార్యాలయాలు... ఇలా ఏ చోటైనా వేధింపులకు గురయ్యే మహిళలకు ఠక్కున గుర్తొచ్చేది షీ టీమ్స్‌. ఇప్పటికే దాదాపు నగరంలోని 95 శాతానికిపైగా ప్రజలకు షీ టీమ్‌ సేవలపై అవగాహన ఉందని, ఓ ఎన్జీవో నిర్వహించిన సర్వేలో తెలిసింది. అయితే మహిళల భద్రత కోసం మేమున్నామంటూ నగరవాసులను భాగస్వామ్యం చేస్తూ షీ టీమ్స్‌ 5కే రన్‌ను ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తున్నామని నగర అదనపు పోలీసు కమిషనర్, షీ టీమ్స్‌ ఇన్‌చార్జి స్వాతిలక్రా తెలిపారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement