వెరైటీ చోరుడు | veriety thief arrested in panjagutta | Sakshi
Sakshi News home page

వెరైటీ చోరుడు

Jul 10 2016 4:31 AM | Updated on Sep 4 2017 4:29 AM

వెరైటీ చోరుడు

వెరైటీ చోరుడు

ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ఖరీదైన వస్తువులపైనే కన్ను
చదివింది పదో తరగతే మూడు భాషల్లో ప్రావీణ్యం
చోరీసొత్తుతో దేవాలయాలకు విరాళాలు ఈఓల క్వార్టర్లలోనే బస

పంజగుట్ట : ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.   శనివారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన అబ్బూరి సోమయ్య అలియస్ శ్రీకాంత్ చౌదరీ అలియస్ అక్కినేని అలియాస్ కార్తీక్ (35) 2007లో కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చి వైజాగ్‌లో దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు.

ఆ తరువాత గన్నవరం, చెన్నై, విజయవాడ, మాదాపూర్, కేపిహెచ్‌పి, త్రివేండ్రం, బెంగళూరు,  నర్సారావుపేట్, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో  చోరీలకు పాల్పడటంతో ఇతనిపై 41 కేసులు నమోదై ఉన్నాయి. చెన్నైలోనే 17 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతనిపై చైన్నై పోలీసులు  2010 పీడీ యాక్ట్ నమోదు చేశారు. కేవలం పదవ తరగతి చదివిన సోమయ్య తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని వారిని ప్రలోభపెట్టి వారి నుంచి బంగారు ఆభరణాలు, ఖరీదైన సెల్‌ఫోన్లు దొంగిలించుకొని పారిపోతాడు. ఇతనిపై నర్సారావుపేట్, విజయనగరం పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి.  ఖరీదైన హాస్టళ్లలో ఉంటూ వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ఐపాడ్‌లను కాజే సేవాడు. క్యాబ్‌లలో తిరుగుతూ డ్రైవర్ల దృష్టి మరల్చి వారి ఖరీదైన ఫోన్లు కూడా ఎత్తుకెళ్లేవాడు.

 ఆలయ ఈఓల గదుల్లోనే బస
ఇతనికి దక్షిణ భారత దేశంలోని పలు దేవాలయాల్లో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయి. దొంగతనం చేయగా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆలయ ఇఓలకు నేరుగా చందాల రూపంలో అందజేసి వారి గదిలోనే బస చేసేవాడు. ఇతని ఇతర అలవాట్లు లేకపోగా, కేవలం ఖరీదైన ఫోన్లు వాడటం, ఖరీదైన అద్దె కార్లలో తిరగడం, జల్సాలకు చోరీ సొత్తును ఖర్చు చేసేవాడు.  కారు డ్రైవింగ్ రాకపోవడంతో అద్దెకార్లలో తిరుగుతూ వాటి డ్రైవర్లను మోసం చేసేవాడు.  శ్రీనగర్‌కాలనీలో దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పంజగుట్ట  డీఐ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎసైై్స శివకుమార్ వలపన్ని పట్టుకున్నారు. నిందితుని నుంచి 13 ల్యాప్‌టాప్‌లు, ఒక యాపిల్ ఐ పాడ్, 14 ఖరీదైన సెల్‌ఫోన్లు, ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.  ఇతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు డీసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement