రాయని డైరీ : ఇమ్రాన్‌ ఖాన్‌ (పాక్‌ ప్రధాని)

Madhav Shingaraju Article on Pakistan Prime Minister Imran Khan - Sakshi

మాధవ్‌ శింగరాజు

తలనొప్పిగా ఉంది! అరవై ఆరేళ్ల వయసులో తలనొప్పి రావడం సహజమా అసహజమా కనుక్కొని రమ్మని డాక్టర్‌ దగ్గరికి మనిషిని పంపాను. ఆ మనిషి ఇంతవరకు రాలేదు. 
‘‘ఎవరి కోసం చూస్తున్నారు ఇమ్రాన్‌జీ’’ అంటూ వచ్చారు షా మెహమూద్‌ ఖురేషీ. 
‘‘మీరు ఫారిన్‌ అఫైర్స్‌ మినిస్టర్‌ కదా షాజీ.. ఇంటర్నల్‌ ఇష్యూస్‌ చెప్పుకోవడం బాగుంటుందా మరి?’’ అన్నాను. 
‘‘నేను చూసేది ఫారిన్‌ అఫైర్సే అయినా, అవన్నీ ఇంటర్నల్‌ అఫైర్స్‌ కోసమే ఇమ్రాన్‌జీ.. పర్వాలేదు చెప్పండి’’ అన్నారు. 
‘‘అరవై ఆరేళ్ల వయసులో తలనొప్పి రావడం సహజమా అసహజమా కనుక్కొని రమ్మని డాక్టర్‌ దగ్గరికి మనిషిని పంపాను షాజీ. ఇంతవరకు ఆ మనిషి రాలేదు. రాని మనిషి గురించి ఆలోచిస్తూ, వచ్చిన తలనొప్పిని మర్చిపోగలుగుతున్నాను కానీ.. మనిషి రాలేదేమిటన్న ఆలోచనతో తిరిగి నా తలనొప్పి నాకు గుర్తుకువచ్చేస్తోంది’’ అన్నాను. 
నాకంటే మూడేళ్లు చిన్నవాడు ఖురేషీ. కానీ నాకన్నా పదేళ్లు చిన్నవాడిలా ఉంటాడు. అది కాదు ఆశ్చర్యం, ఫారిన్‌ మంత్రిగా అతడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా ఉన్నాడో, పన్నెండు నెలల తర్వాత ఇప్పుడూ అలానే ఉన్నాడు! ఆరోజే అడిగాను.. ‘షాజీ.. మీరింత ఫిట్‌గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అని. పెద్దగా నవ్వాడు. ‘ఇమ్రాన్‌జీ, ఒకటి చెప్పమంటారా.. క్రికెట్‌ ఆడేవాళ్ల కన్నా క్రికెట్‌ చూసేవాళ్లే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారు. ఇప్పటికీ నేను ఇండియా మీద మీరు ఆడిన పాత మ్యాచ్‌లన్నిటినీ రీప్లే చేసుకుని మరీ చూస్తుంటాను’ అన్నాడు! మనసుని రంజింపజేయడంలో ఖురేషీ గొప్ప ఆటగాడు.
‘‘తలనొప్పి కశ్మీర్‌ వంటిది ఇమ్రాన్‌జీ. ఉందని గుర్తు చేసుకుంటే వస్తుంది. లేదని గుర్తు పెట్టుకుంటే గాయబ్‌ అవుతుంది’’ అన్నారు ఖురేషీ. 
‘‘ఈ గుర్తుపెట్టుకోవడమే పెద్ద తలనొప్పిగా ఉంది షాజీ. అయినా లేని దానిని ఉందని గుర్తుపెట్టుకోగలం కానీ, ఉన్నదానిని లేదని ఎలా గుర్తుపెట్టుకోగలం చెప్పండి?’’ అన్నాను. 
‘‘తలనొప్పి కశ్మీర్‌ వంటిది అంటే, కశ్మీర్‌ తలనొప్పి వంటిదని కాదు ఇమ్రాన్‌జీ. ఉన్నదానిని లేదని గుర్తుపెట్టుకునే అవసరం లేకున్నా, లేనిదానిని ఉందని గుర్తుపెట్టుకోవడం మర్చిపోలేదన్న సంగతిని గుర్తు చేస్తుండడం అవసరం. కశ్మీర్‌ను మన తల అనుకున్నప్పుడు ఆమాత్రం తలనొప్పి సహజమే. నా ఉద్దేశం మీ తలనొప్పి మీ అరవై ఆరేళ్ల వయసు వల్ల వస్తున్నది కాదు. డెబ్బయ్‌ రెండేళ్ల కశ్మీర్‌ వల్ల వస్తున్నది’’ అన్నారు ఖురేషీ!
‘హాహ్హాహా’ అని పెద్దగా నవ్వాను. 
‘‘అంటే నేను వయసుకు మించిన భారాన్ని మోస్తున్నాననే కదా షాజీ’’ అన్నాను.
‘‘మీరు గుండెల నిండా నవ్వడం చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఇమ్రాన్‌జీ!  మీకు గుర్తుందా.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే నెలలో మీరు ప్రధాని అయ్యారు. ఆరోజు చూడ్డమే చిన్న చిరునవ్వునైనా మీలో! మళ్లీ లేదు’’ అన్నారు ఖురేషీ. 
‘‘ధన్యవాదాలు షాజీ’’ అన్నాను. 
ఎప్పుడూ కశ్మీర్‌ గురించే కాకుండా, పాక్‌ ప్రధాని సంతోషం గురించి కూడా కాస్త ఆలోచించే ఒక పౌరుడిని నా దేశంలో నేను మొదటిసారిగా చూస్తున్నాను!
డాక్టర్‌ దగ్గరికి వెళ్లిన మనిషి ఇంకా రాలేదు! ఖురేషీతో మాట్లాడుతుంటే తలనొప్పి తగ్గినట్లే ఉంది కానీ, ఖురేషీ వెళ్లిపోయాక మళ్లీ తలనొప్పి వస్తే?!
‘‘మీరే డాక్టర్‌ దగ్గరికి వెళ్లవలసింది ఇమ్రాన్‌జీ. లేదా, డాక్టర్‌నే మీ దగ్గరికి రప్పించుకోవలసింది. మీరు పంపిన మనిషికి మీ తలనొప్పి సంగతి గుర్తుంటుందని ఎలా చెప్పగలం? అతడికేం తలనొప్పులున్నాయో..’’ అన్నారు ఖురేషీ. 
కశ్మీర్‌ విషయం ఐక్యరాజ్య సమితితో మాట్లాడమని నేను చైనాను పంపడం గురించి కాదు కదా ఖురేషీ మాట్లాడుతున్నది!! 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top