
ఇండోర్ సీ... యు మస్ట్ సీ!
ఓషన్ డోమ్‌కు ఉండే రూఫ్ అధిక ఎండ, వానల నుంచి టూరిస్ట్‌లకు రక్షణగా నిలుస్తుంది.
ఓషన్ డోమ్‌కు ఉండే రూఫ్ అధిక ఎండ, వానల నుంచి టూరిస్ట్‌లకు రక్షణగా నిలుస్తుంది. ఓపక్క సీలింగ్ అంతా ఆకాశంలా కనిపించేలా డిజైన్ చేయడం వల్ల అందమైన ఆకాశం కింద సముద్రంలో జలకాలాడుతున్న అనుభూతి కలుగుతుంది మనకి.
సముద్రం ఎక్కడుంటుంది? ఎక్కడో ఊరి చివర... దూరంగా... ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటుంది. ఎవరైనా ఇలాగే చెప్తారు... ఒక్క జపాన్‌లోని మియాజాకి ప్రాంతం వాళ్లు తప్ప. ఎందుకంటే అక్కడ సముద్రం నగర శివార్లలోనో, ఎక్కడో దూరంగానో లేదు. నగరం నడి మధ్యలో, ఓ భవంతిలో ఉంది. వినడానికే వింతగా ఉంది కదూ! కానీ ఇది నిజ్జంగా నిజం.
జపాన్‌లోని కుయుషు ద్వీపంలో ఉన్న మియాజాకి నగరం ప్రకృతి అందాలకు నిలయం. జిమ్ము అనే జపాను రాజు స్మారకస్థలం, పీస్ టవర్, బొటానికల్ గార్డెన్, సిటీ ఫోనిక్స్ జూ పార్క్ మొదలైనవి ఆ నగరాన్ని మంచి టూరిస్టు కేంద్రంగా నిలబెట్టాయి. అయితే వాటన్నిటికంటే ఓ పెద్ద అట్రాక్షన్ ఉందక్కడ. అదే... ఇండోర్ సీ.
ఇండోర్ సీ... ఇంటిలో సముద్రం. వినడానికే వింతగా లేదూ! అలాంటి వింతల్ని సృష్టించడంలో జపాన్‌ని మించిన వాళ్లు ఎవరున్నారు! మియాజాకిలోని షెరటాన్ సిగాయా రిసార్ట్‌లో ఏకంగా ఓ సముద్రాన్నే సృష్టించారు వారు. సముద్రం మాత్రమేనా, సముద్రం ఉన్నచోట ఎలాంటి వాతావరణమైతే ఉంటుందో, దాన్నీ సృష్టించారు. దాంతో ఈ కృత్రిమ సముద్రం దగ్గరకు వెళ్తే, నిజమైన సముద్రం దగ్గరకు వెళ్లిన అనుభూతే కలుగుతుంది. ప్రపంచంలోనే పెద్దదైన కృత్రిమ సముద్రంగా ఇది గిన్నిస్ రికార్డ్‌ల్లోకి కూడా ఎక్కింది.
మియాజాకిలో ఓ పెద్ద డోమ్‌లాంటి నిర్మాణాన్ని నెలకొల్పారు మొదట. తర్వాత అందులో కృత్రిమ సముద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం సెటప్‌ను వాళ్లు ఓషన్ డోమ్ అని అంటారు. ఈ ఓషన్ డోమ్‌కు ఉండే రూఫ్ అధిక ఎండ, వానల నుంచి టూరిస్ట్‌లకు రక్షణగా నిలుస్తుంది. ఓపక్క సీలింగ్ అంతా ఆకాశంలా కనిపించేలా డిజైన్ చేయడం వల్ల అందమైన ఆకాశం కింద సముద్రంలో జలకాలాడుతున్న అనుభూతి కలుగుతుంది మనకి.
ఇంకా మంటలు చిమ్మే కృత్రిమ అగ్ని పర్వతాలు, కంటికి ఇంపుగా కనిపించే తెల్లటి ఇసుక, హైటెక్ వేవ్ మెషినరీ వంటి ఆధునిక అందాలు అద్దారు. ఇవన్నీ కలిసి దీన్ని ప్రపంచంలోని ‘మోస్ట్ టెక్నలాజికల్లీ అడ్వాన్స్‌డ్ ఇండోర్‌బీచ్’గా నిలుపుతున్నాయి.
నిజమైన బీచ్ 300 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ టూరిస్ట్‌లు మాత్రం ఈ కృత్రిమ బీచ్‌లో విహరించడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ బీచ్‌లో ఎంజాయ్ చేయడానికి విదేశీ టూరిస్టులైతే క్యూ కడుతున్నారు. ‘‘పర్యాటక కేంద్రం అంటే అందమైన ప్రదేశమే కాదు, కాసింత ఆశ్చర్యం కూడా కలగలిసి ఉండాలి, అలా ఉండటం వల్లే అసలు బీచ్ కంటే ఈ కృత్రిమ బీచ్‌కి రావడానికి మా పిల్లలు ఉవ్విళ్లూరుతున్నారు’’ అంటున్నాడు పాకిస్తాన్‌కు చెందిన టూరిస్ట్ అషఫ్ర
ఎనభై అయిదు మీటర్ల పొడవైన ఈ కృత్రిమ తీరరేఖ ఎంతగానో ఆకట్టుకోవ డానికి మరో కారణం ఏమి టంటే... తీర రేఖ పొడవునా రకరకాల దుకాణాలు ఉంటాయి. అక్కడ రకరకాల వస్తువులు దొరుకుతాయి. అది కూడా అందుబాటు ధరల్లో. అలాగే బీచ్‌లో ఆరు ఫుట్‌బాల్ గ్రౌండ్‌లు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడూ ఆటగాళ్ల హషారు అరుపులతో సందడిగా ఉంటాయి.
1993లో ప్రారంభించిన ఈ ఓషన్ డోమ్‌కు వచ్చిన ప్రాచుర్యాన్ని చూసి, 2007లో మళ్లీ సరికొత్త మార్పులు చేశారు.
అప్పట్నుంచి ఇది మరీ పాపులర్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా జపాన్ వెళ్తే దీన్ని చూడటం మాత్రం మర్చి పోకండి. కృత్రిమమైన కొబ్బరి, ఈతచెట్ల అందాలను చూస్తూ, కృత్రిమ రెయిన్ ఫారెస్ట్ నుంచి ఎగిరొచ్చే చిలుకల ముద్దుల అరుపులు వింటూ, ఆ అలల మధ్య జలకాలాడే అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించే అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే మరి!