విడిపోతేనే సీమకు మనుగడ | special rayalaseema our target | Sakshi
Sakshi News home page

విడిపోతేనే సీమకు మనుగడ

Aug 25 2016 11:24 PM | Updated on Sep 4 2017 10:52 AM

విడిపోతేనే సీమకు మనుగడ

విడిపోతేనే సీమకు మనుగడ

రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తప్ప మనుగడ సాధ్యం కాదని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్‌) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, అమరావతి ఫ్రీ జోన్‌గా ప్రకటించాలంటూ నాలుగు రోజులుగా కలెక్టరేట్‌ ఎదుట రాయలసీమ విద్యార్థి సంఘం చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరాన్ని గురువారం సందర్శించారు.

కడప సెవెన్‌రోడ్స్‌ :

రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తప్ప మనుగడ సాధ్యం కాదని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్‌) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, అమరావతి ఫ్రీ జోన్‌గా ప్రకటించాలంటూ నాలుగు రోజులుగా కలెక్టరేట్‌ ఎదుట రాయలసీమ విద్యార్థి సంఘం చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. శ్రీశైలం ముంపు ప్రాంతమైన కర్నూలుజిల్లాకు ఒక్క పైసా ఇవ్వకుండా, పుష్కరాల సందర్భంగా నిధులన్నీ కోస్తాలో ఖర్చు చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపారని విమర్శించారు. తాము సొంతంగా రాయలసీమ పుష్కరాలను నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతి ఇంటిపై ఒక నల్లజెండా ఎగురేసి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.  ప్రత్యేక హోదా వల్ల కోస్తా ప్రాంతమే బాగుపడుతుంది తప్ప రాయలసీమకు ఎలాంటి మేలు జరగదన్నారు. బాబుకు అమరావతి తప్ప సీమ గోడు పట్టడం లేదని ధ్వజమెత్తారు.అమరావతి వరకు గడ్డం పెంచినా నీళ్లు ఇవ్వరంటూ పరోక్షంగా సతీష్‌రెడ్డిని ఎద్దేవా చేశారు. త్వరలో తాను చేపట్టబోయే చైతన్య యాత్రలో ఈ అంశాలపై కుప్పంలోనే చంద్రబాబును ఎండగడతానన్నారు.  తెలంగాణతోపాటు ‘సీమ’ విడిపోయి ఉంటే ఇప్పటికి 10 ఉక్కు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకునే వారమన్నారు. వేలాది కోట్ల ఆదాయాన్ని సమకూర్చే టీటీడీ, శ్రీకాళహస్తి, కాణిపాకం, మంత్రాలయం, శ్రీశైలం దేవస్థానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణం ఆపాలి – సీహెచ్‌
అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇంకా ఎనిమిదేళ్లు రాజధానిగా హైదరాబాదునే ఉపయోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆలోపు సీమ, ఉత్తర కోస్తాలను అభివృద్ది చేసి ఆ తర్వాత రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, సీపీఐ నాయకుడు కృష్ణమూర్తిలు మాట్లాడారు.
దీక్షల విరమణ: నాలుగు రోజులుగా ఆర్‌ఎస్‌యూ అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన దీక్షలను బైరెడ్డి విరమింపజేశారు. కార్యక్రమంలో పవన్‌ విద్యా సంస్థల అధినేత జోగిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement