చినుకు పడితే రాకపోకలు బంద్‌ | national highway bundh when raining | Sakshi
Sakshi News home page

చినుకు పడితే రాకపోకలు బంద్‌

Sep 26 2016 6:58 PM | Updated on Sep 4 2017 3:05 PM

జాతీయ రహదారిపై పరిస్థితి ఇది

జాతీయ రహదారిపై పరిస్థితి ఇది

చినుకు పడితే జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ ఎదురవుతోంది. వందలాది వాహనాలు ఆగిపోతున్నాయి. ఇందుకు అక్రమ నిర్మాణాలే ప్రధాన కారణం.

కబ్జా కోరల్లో చెరువులు, కుంటలు
జోరుగా అక్రమ నిర్మాణాలు
పట్టించుకోని అధికారులు

పటాన్‌చెరు: చినుకు పడితే జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ ఎదురవుతోంది. వందలాది వాహనాలు ఆగిపోతున్నాయి. ఇందుకు   అక్రమ నిర్మాణాలే ప్రధాన కారణం.  అక్రమ పద్ధతుల్లో చెరువులు, కుంటలు, కాలువలను పూడ్చి సాగిస్తున్న నిర్మాణాలే అందుకు కారణమవుతున్నాయి. పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోతే పరిస్థితి మరింత అధ్వానంగా మారనుంది.

రామచంద్రాపురం పరిధిలో నాగులమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా వరద నీరు పొంగి పొర్లుతుంది. చినుకు పడితే రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. జాతీయ రాహాదారి నిర్మాణ సమయంలోనే కొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే సమస్య వచ్చేది కాదని కొందరంటున్నారు. బకెట్‌ ఆకారంలో కల్వర్టులు కడతామని అధికారులంటూ కాలయాపన చేస్తున్నారు.   వాస్తవానికి నీరు పల్లమెరుగు అన్న వాస్తవాన్ని గుర్తిస్తే రాయసంద్రం చెరువు ఎఫ్‌టీఎల్‌ లోతట్టు ప్రాంతాలన్ని తాజా వాతావరణం పరిస్థితి కారణంగా బయటపడింది. 

అలాగే పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లో కాలువలు ఇప్పటికీ కబ్జాకు గురవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు.  నిబంధనలు పక్కన పెట్టి బిట్టు బిట్లుగా అనుమతులు తీసుకుని అక్రమంగా బహుళ అంతస్తు భవంతులు నిర్మిస్తున్న ఓ అధికార పార్టీ నేత చేస్తున్న నిర్మాణాలను ఎవరూ అడ్డుకోవడంలేదు. సింఫనీ హోమ్స్‌ పరిధిలో వాణిజ్య భవంతికి అనుమతులేవి లేకపోయినా ఓ రియల్టర్‌ దర్జాగా నిర్మాణాలు సాగిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారు.  సింఫనీ పార్క్‌ హోమ్స్‌ పరిధిలో ఇటీవల అక్రమ విధానాల్లో ఇళ్లు కడుతున్నారని ఆ కాలనీ సొసైటీ సభ్యులు వరుసబెట్టి జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు మెయిల్స్‌ చేయడంతో అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సామాన్యులు ఫిర్యాదు చేసేంత వరకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం స్పందించడంలేదు. వందగజాల్లో ఇల్లు నిర్మిస్తామని పద్ధతి ప్రకారం అనుమతి కోసం వెళ్లే సామాన్యుడిని అనేక కొర్రిలతో ఇబ్బంది పెట్టే  జీహెచ్‌ఎంసీ అధికారులు బడా వ్యాపారులకు సులువుగా అనుమతులిస్తున్నారు. ఆ తరువాత ఆ వ్యాపారి అక్కడ ఏలాంటి నిర్మాణాలు సాగిస్తున్నా పట్టించుకోవడంలేదు.

పటాన్‌చెరు శివారులోని వాగులను ఆనుకుని నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణీత్‌ హోమ్స్‌, సింఫనీ హోమ్స్‌ పరిధిలో వాగును ఆనుకుని నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాయసముద్రం అలుగు కాల్వలను పునరుద్ధరించేందుకు అడ్డుగా ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.

జాతీయ రహదారిపై నిర్మాణాలకు అనుమతులిచ్చే టప్పుడైనా కనీసం నిబంధనలను పాటించాలని పట్టణ పౌరులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదే విషయమై స్థానిక పట్టణ ప్రణాళిక విభాగం అధికారి భువనేశ్వరి ‘న్యూస్‌లైన్‌’కు వివరణ ఇస్తూ అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇస్తున్నామన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు. సింఫనీ హోమ్స్‌లో జరగుతున్న నిర్మాణాన్ని అపివేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement