రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది.
యాచారం (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి తాడిపర్తి గ్రామంలో కడారి రాములు ఇంటి ఆవరణలో ఉన్న మేకల మందపై చిరుత దాడి చేసి ఒక మేకను ఎత్తుకుపోయింది. సోమవారం ఉదయం గమనించిన బాధిత రైతు స్థానికుల సాయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వారు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో అటవీ ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో చిరుతల సంచారం ఎక్కువైంది. వారం క్రితం కొత్తపల్లిలోకి ప్రవేశించిన ఒక చిరుత మేకను ఎత్తుకుపోయింది. దీంతో అటవీ అధికారులు దానిని బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు.అయితే తాడిపర్తిలోకి ఆదివారం రాత్రి చిరుత ప్రవేశించటంతో ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.