అపోలో ఘనత: 32 ఏళ్ల తర్వాత కూర్చొంది

Apollo Doctors Made Woman To Sit After 32 Years - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జీవితమంతా నిలబడే బ్రతకాల్సి వస్తే?. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుంటాం. ప్రమాదవ శాత్తు తన ఐదవ ఏట అగ్ని ప్రమాదం బారిన పడిన ఓ మహిళ గత 32 ఏళ్లుగా నిల్చొనే ఉంటున్నారు. నిల్చొవడం లేదా పడుకోవడం మినహా ఆమె గత 32 ఏళ్లుగా కూర్చొనేలేదు. అలాంటి వ్యక్తిని కూర్చొనేలా చేసి ఆమె మొహంలో నవ్వులు పూయించారు ఢిల్లీ వైద్యులు.

ఉజ్బెకిస్థాన్‌కు చెందిన గుల్నోరా రాపిఖోవా(37) కథ ఇది. ఒక రోజు ఇంట్లోని స్టవ్‌ దగ్గర నిల్చున్నప్పుడు గుల్నోరా దుస్తులకు మంటలు అంటుకున్నాయి. మంటలతోనే ఆమె బయటకు పరిగెత్తింది. ఇరుగూ పొరుగు వారు చూసి మంటలు ఆర్పి స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనలో గుల్నోరాకి తొడల కింద భాగం తీవ్రంగా కాలిపోయింది.

దాదాపు 18 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంది. ఈ సమయంలో దాదాపు ఐదు సార్లు శస్త్ర చికిత్సలు జరిగాయి. అయినా ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆమె కూర్చోలేకపోయారు. అధైర్యపడని గుల్నోరా అలానే పాఠశాలకు వెళ్లి నిల్చొని పాఠాలు వినేవారు.

అదృష్టవశాత్తు ఈ ఏడాది మేలో తాష్కెంట్‌లో అపోలో వైద్యులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గుల్నోరా వచ్చారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెకు చికిత్స అందించేందుకు అంగీకరించారు. ఓ మానవతావాది సాయంతో గుల్నోరా చికిత్సకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వచ్చారు.

తాష్కెంట్‌ నుంచి న్యూఢిల్లీకి వచ్చే విమానంలో సైతం ఆమె నిల్చొనే వచ్చారు. 10 నుంచి 15 ఏళ్ల కంటే ఎక్కువకాలం ఉండే గాయాలు క్యాన్సర్స్‌గా మారే ప్రమాదం ఉండటంతో గుల్నోరాకు పలుమార్లు బయాప్సీ పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ణయించుకున్న తర్వాత శరీరంలోని వేరే భాగాల నుంచి కొంత కండను తీసి గాయాలైన చోట్ల అమర్చారు.

నెల రోజులకు పూర్తిగా కోలుకున్న గుల్నోరా కూర్చొగలిగారు. అనంతరం ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తాను కూర్చొగలుగుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పానని, తనని చూస్తేగానీ వారు ఈ విషయం నమ్మలేరని గుల్నోరా అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top