ముగ్గురి ఆత్మహత్య

Three People Commit Suicide In Khammam - Sakshi

భర్త మందలించాడని ఒకరు, మగాడు మోసగించాడని ఇంకొకరు, కడుపు నొప్పి భరించలేక మరొకరు... ఇలా శనివారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

భర్త మందలించాడని... 

దమ్మపేట ఖమ్మం : భర్త మందలించాడన్న మనోవేదనతో ఓ మహిళ కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ జలకం ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని రంగువారిగూడెం గ్రామానికి చెందిన గంపా వెంకటేశ్వరికి, ఇదే మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామస్తుడు గంపా నాగేంద్రబాబుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. బుధవారం సాయంత్రం, పిల్లాడు అదే పనిగా ఏడుస్తుండడంతో ఆ తల్లి విసిగిపోయి, చిన్న దెబ్బేసింది. దీనిని గమనించిన భర్త నాగేంద్రబాబు, ఆమెను మందలించాడు.

దీంతో తీవ్రంగా మనోవేదనకు లోనైన ఆమె, ఇంట్లో ఉన్న కలుపు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను భర్త నాగేంద్రబాబు, అతని చెల్లెలు రెడ్డిరోజా కలిసి ఆటోలో సత్తుపల్లి ప్రభుత్వాసుత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. ఆమె అక్కడే గురువారం రాత్రి మృతిచెందింది. ఆమె తల్లి పాండ్ల శేషమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మగాడు మోసగించాడని... 

దమ్మపేట : పెళ్లి కాకుండానే ఆమె తల్లయింది. తనను పెళ్లి చేసుకోవాలని అతడిని కోరింది. నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు... మండలంలోని దురదపాడులో గురువారం అర్ధరాత్రి ఇది జరిగింది. దురదపాడు గ్రామానికి చెందిన అవివాహితురాలు సున్నం అలివేలు(25), ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నాలుగేళ్ల క్రితమే ఓ పాపకు తల్లయింది. తనను పెళ్లి చేసుకునేందుకు ఆ ప్రియుడు నిరాకరించాడు.

దీంతో, తీవ్ర మనోవేదనను తట్టుకోలేని ఆమె గురువారం అర్ధరాత్రి ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి నాగమ్మ ఫిర్యాదుతో ఎస్సై జలకం ప్రవీణ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కడుపు నొప్పి భరించలేక బాలిక... 

మధిర : కడుపు నొప్పి భరించలేని బాలిక, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధిర పట్టణంలోని ముస్లిం బజారులో శుక్రవారం ఇది జరిగింది. ముస్లిం బజారుకు చెందిన రషీద్‌ వంట మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె అర్షియా ఖాఠూన్‌(17), మధిర పట్టణంలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఆమె మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. దీనిని తట్టుకోలేక, శుక్రవారం తన ఇంటి పైనున్న గదిలో చదువుకుంటానని చెప్పి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రషీద్‌ ఫిర్యాదుతో కేసును టౌన్‌ ఎస్‌ఐ బెంద్రం తిరుపతిరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top