
మృతదేహాన్ని బయటకు తీసేందుకు నుజ్జునుజ్జయిన కారును కటర్స్‌తో కట్ చేస్తున్న ఫైర్ సిబ్బంది
సాక్షి, ఒంగోలు : జాతీయ రహదారి 16పై ఒంగోలు సమీపంలోని పోతురాజు కాలువ పక్కన ఉన్న ఓం శక్తి క్రాకర్స్ గోడౌన్ ఎదురుగా శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి చెన్నైకు వెళుతున్న కారు ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో కారు సగానికి పైగా లారీ కిందకు దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న డాక్టర్ సుకుమార్ పుహానే (47) గుండెలకు స్టీరింగ్ బలంగా ఒత్తుకోవడంతో నోరు, చెవుల నుంచి నెత్తురు బయటకు వచ్చి కారులోనే కన్నుమూశాడు.
ముందు వెళుతున్న లారీ డ్రైవర్ ఈ ఘటనతో లారీని అక్కడే వదిలి అదృశ్యమయ్యాడు. లారీ మహారాష్ట్ర నుంచి నెల్లూరు వైపు వెళుతోంది. ప్రమాద సమాచారం తెలియడంతో హైవే పెట్రోలింగ్ వాహనాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కారులోని వ్యక్తిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. లారీని ముందుకు కదిలిస్తూ కారును వెనుకవైపు నుంచి ఒక ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్‌కు కట్టి రెండు వాహనాలను వేరుచేశారు. అనంతరం కారులో ఉన్న సుకుమార్ మృతదేహాన్ని బయటకు తీసేందుకు అగ్నిమాపక శాఖ బృందం వచ్చి కారును ముక్కలుగా కత్తిరించి బయటకు తీశారు.
వెలుగులోకి వచ్చిన సమాచారం :
ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహన చోదకులు 100కు సమాచారం అందించారు. దీంతో హైవే పెట్రోలింగ్ వాహనాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మృతుడి వద్ద దొరికిన మొబైల్ ఆధారంగా వారు చివరగా కాల్ చేసిన వ్యక్తికి ఫోన్‌చేయడంతో మృతుడు ఎవరనేది స్పష్టమైంది. సుకుమార్ పుహాన్ 2018 డిసెంబర్ వరకు ఒంగోలు సమీపంలోని పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో క్యూఏఐసీ విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం ఆయన ఉద్యోగం నుంచి మానేశారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఈయన ఒడిశాలో ఎంఎల్‌ఏ అభ్యర్థిగా కూడా పోటీచేసినట్లు అతని స్నేహితులు పేర్కొంటున్నారు.
స్నేహితుడి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న పేస్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్రీనివాసన్‌కు ఊహించని రీతిలో సుకుమార్ మొబైల్ నుంచి కాల్ రావడంతో ఎక్కడ వరకు వచ్చావంటూ మాట్లాడేందుకు యత్నించగా.. ఆయన చనిపోయారని, తాము పోలీసులమని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్రీనివాసన్ తీవ్ర ఉద్వేగానికి గురై కనీసం మాట్లాడలేకపోయారు. తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్ ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వస్తేగాని పూర్తి సమాచారం అందే అవకాశం లేదు.