పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి

Police Meeting In Commissionerate Warangal - Sakshi

వరంగల్‌ క్రైం: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచే విధంగా పోలీసుల విధులు నిర్వహించాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ అన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సీపీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసుల దర్యాప్తులో కిందిస్థాయి అధికారులను భాగస్వాములను చేయాలన్నారు. దీని వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తారని ఆయన పేర్కొన్నారు.

పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై రశీదు ఇవ్వడంతో ఆస్తి నేరాలకు సంబంధించి కేసులను వెంటనే నమోదు చేయాలని సూచించారు. నమోదు చేసిన కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను ఫిర్యాదుదారులకు ఉచితంగా అందజేయాలన్నారు. కేసుల్లో సాక్షులుగా ఉండే వ్యక్తులను పోలీసుస్టేషన్‌కు పిలువకుండా వారిని ఇంటివద్దే పెద్ద మనుషుల సమక్షంలో విచారించాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో› మహిళలు, వృద్ధులు, పిల్లలు, మద్యం సేవించిన వారిని పోలీసుస్టేషన్‌లల్లో ఉంచవద్దని ఆదేశించారు.
 
భూకబ్జాదారుల వివరాలు సేకరించాలి..
కమిషనరేట్‌ పరిధిలోని భూకబ్జాదారుల వివరాలను సేకరించాలని సీపీ పోలీసులను ఆదేశించారు. దీంతో పాటు ఆస్తి నేరాలు, మోసాలకు పాల్పడుతున్న వారి పూర్తి సమాచారం, ఫోటోలు, వేలి ముద్రాలు సేకరించాలన్నారు.అవసరమైతే పీడీ యాక్ట్‌  నమోదుకు  పూర్తి స్థాయి సమాచారం కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముఖం గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను  వినియోగించుకోవాలన్నారు. అనంతరం వివిధ పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసుల పరిష్కరాలు, అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించారు.సమావేశంలో డీసీపీలు వెంకట్‌రెడ్డి, రావిరాల వెంకటేశ్వర్లు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top