
బనశంకరి : భర్త జీవించి ఉండగానే మృతి చెందినట్లు నకిలీ ధ్రువీకరణపత్రం తయారు చేసిన ఓ వివాహిత మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఈ ఉదంతం కుమారస్వామిలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన నాగరాజ్ అనే వ్యక్తి బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల నాగరాజ్ భార్య మృతిచెందడంతో మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ సమయంలో చిక్కబళ్లాపుర నివాసి వెంకటలక్షి పరిచయమైంది.
అనంతరం ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో తన భర్త 1990లో మృతి చెందినట్లు వెంకటలక్ష్మి చిక్కబళ్లాపురం తహసీల్దార్ కార్యాలయంలో ధ్రవీకరణపత్రం తీసుకుంది. వివాహమైన అనంతరం వెంకటలక్ష్మి నాగరాజ్ కట్టిన బంగారుమంగళసూత్రం తో పాటు ఇతర బంగారుఆభరణాలు విక్రయించింది. దీంతో అనుమానపడిన నాగరాజ్ చిక్కబళ్లాపుర తహశీల్దార్ కార్యాలయంలో విచారించగా వెంకటలక్ష్మీ భర్త బతికి ఉన్నట్లు తెలిసింది. దీంతో నాగరాజ్ శుక్రవారం కుమారస్వామిలేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.