లారీల సమ్మె ఉధృతం

Lorry Owners Strike YSR Kadapa - Sakshi

 ప్రొద్దుటూరు క్రైం (వైస్పార్‌ కడప) : ఐదు రోజులుగా కొనసాగుతున్న లారీల సమ్మె మరింత ఉధృతమైంది. తమ డిమాండ్లపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో సమ్మెను ఉధృతం చేయాలని లారీ అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రకటించారు. డీజిల్, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని, గడువు ముగిసిన టోల్‌ ప్లాజాలను నిలిపి వేయాలని, టోల్‌ విధానంలో పారదర్శకత పాటించాలని, థర్డ్‌పార్టీ ప్రీమియం పెంపును నిలుపుదల చేసి మళ్లీ సమీక్షించాలని, నేషనల్‌ పర్మిట్‌ కలిగిన గూడ్స్‌ వాహనాలకు ఇద్దరు డ్రైవర్ల నిబంధనను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈ నెల 20 నుంచి దేశవ్యాప్తంగా లారీల యజమానులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రారంభంలో నిత్యావసర సరుకుల రవాణా లారీలకు మినహాయించారు. ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. దీంతో నిత్యాసర సరుకులను రవాణా చేసే లారీలను కూడా నిలిపేయాలని అసోసియేషన్‌ ప్రతినిధులు, లారీల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య పట్టణంగా పేరు పొందిన ప్రొద్దుటూరుకు అన్ని రకాల వస్తువులు, నిత్యావసర సరుకులు రోజూ వందలాది లారీల్లో దిగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఉన్న మండీ మర్చంట్‌కు రాయలసీమలోనే మంచి పేరుంది. రాయలసీమ జిల్లాలకే గాక తెలంగాణా జిల్లాలకు ప్రొద్దుటూరు నుంచి నిత్యావసర సరుకులు సరఫరా చేస్తుంటారు. ప్రొద్దుటూరులో ఉన్న వస్త్రభారతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దుస్తులు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి  కూరగాయలు దిగుమతి అవుతాయి. లారీల సమ్మెతో మండీ మర్చంట్, వస్త్ర వ్యాపారంతోపాటు నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

5 రోజుల్లో రూ.10 కోట్ల మేర నష్టం
ప్రొద్దుటూరులోని లారీ అసోసియేషన్‌లో సుమారు 500కు పైగా లారీలు ఉన్నాయి. దాదాపు 3 వేల కుటుంబాలు లారీలపై ఆధారపడి జీవిస్తున్నాయి. రోజూ 300లకు పైగా లారీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న బంద్‌ కారణంగా లారీలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మె కారణంగా జిల్లా మొత్తం సుమారు రూ. 10 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. రోజూ లారీకి వెళ్తేనే పూట గడుస్తుందని, ఐదు రోజులుగా పని లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు, ఇతర కార్మికులు అంటున్నారు.

కాగా లారీల సమ్మెను దృష్టిలో ఉంచుకొని ప్రొద్దుటూరు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డ్రైవర్లకు, క్లీనర్‌లు, ఇతర కార్మికులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. పనులు లేకపోవడంతో కార్మికులు అసోసియేషన్‌ కార్యాలయాలు, బ్రోకర్‌ ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆల్‌ఇండియా నిరవధిక బంద్‌ కొనసాగుతున్నా రాత్రి వేళల్లో కొన్ని రాష్ట్రాల నుంచి ప్రొద్దుటూరుకు, ప్రొద్దుటూరు మీదుగా ఇతర ప్రాంతాలకు లారీలు వెళ్తున్నాయి. వీటిని ఆపేందుకు స్థానిక అసోసియేషన్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. బంద్‌ ఉపసంహరించే వరకు లారీలను నడిపేది లేదని అసోసియేషన్‌ కార్యదర్శి సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నిత్యావసరాల బంద్‌తో ఆందోళన 
మంగళవారం నుంచి నిత్యావసర సరుకుల రవాణాను కూడా నిలిపేయడంతో ప్రజలతోపాటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్‌ చేపట్టడంతో నిత్యావసర సరుకులపై లారీల బంద్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాకు గుజరాత్, బీజాపూర్, కాశ్మీర్, కలకత్తా, ఢిల్లీ, తదితర రాష్ట్రాల నుంచి కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు దిగుమతి అవుతాయి. లారీల సమ్మెతో వీటి దిగుమతి ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తు రవాణా లారీలు రాత్రి వేళల్లో నడుస్తాయి. ఇకపై రాత్రి సమయాల్లో నడిచే లారీలను ఎక్కడికక్కడే ఆపేస్తామని లారీ యజమానులు తెలిపారు.

బలవంతంగా ఆపితే చర్యలు
లారీలను బలవంతంగా ఎక్కడైనా ఆపితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు మీదుగా వెళ్తున్న రెండు లారీలను స్థానికంగా ఉన్న లారీ యజమానులు కొందరు ఆపారు. విషయం తెలియడంతో రూరల్‌ సీఐ ఓబులేసు అసోసియేషన్‌ ప్రతినిధులను, లారీ యజమానులను పిలిపించారు. స్వచ్ఛందంగా లారీల బంద్‌ నిర్వహిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని, బలవంతంగా ఒక్క లారీని కూడా ఆపరాదన్నారు. లారీలను ఆపిన కారణంగా వాటి యజమానులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ అన్నారు. సమ్మె అందరి కోసం చేస్తున్నామని, అందరూ అర్థం చేసుకొని సహరించాలని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఒక వేళ దారిలో ఎవరైనా లారీలను ఆపితే తమకు సంబంధం లేదని వారు అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top