పెంచుకునేందుకే బాలుడి కిడ్నాప్‌

Kidnap Case Solved - Sakshi

రైలులో బిహార్‌ తీసుకెళ్లిన నిందితురాలు

వివాహం జరిగి ఏళ్లు గడిచినా సంతానం లేదని ఆవేదన

సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు

జిన్నారం(పటాన్‌చెరు) : వివాహం జరిగి ఏళ్లు గడిచినా పిల్లలు లేకపోవటంతో ఓ బాలుడిని పెంచుకోవాలని ఆశ పడ్డ మహిళ ఏకంగా ఇంటి ముందు ఆడుకుంటున్న మూడున్నరేళ్ల బాలున్ని కిడ్నాప్‌ చేసింది. ఈ సంఘటన జిన్నారం మండలంలోని బొల్లారం గ్రామంలో గత నెల 24న జరిగింది. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఎట్టకేలకు బాలున్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను బొల్లారం సీఐ సతీష్‌రెడ్డి సోమవారం వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... బీహార్‌కు చెందిన సునీల్‌కుమార్, రేఖాకుమారిలు కొంతకాలం క్రితం వలస వచ్చి బొల్లారంలో నివాసం ఉంటున్నారు. సునీల్‌కుమార్‌ ఓ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహించుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం లేరన్న బాధ భార్యా భర్తలను వేధిస్తుండేది. పిల్లలు కావాలని రేఖాకుమారి ఎంతగానో ఆశపడింది.

ఎంతకీ పిల్లలు కాకపోవటంతో బొల్లారంలో వెంకట్‌రెడ్డినగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడున్నరేళ్ల కల్లుగిరి అనే బాలున్ని రేఖాకుమారి గమనించింది. బాలునికి ఏదో ఆశచూపి బయటకు పంపి, తాను కొద్ది సేపటికి బయటకు వెళ్లింది. బాలున్ని తీసుకుని  ఆటోలో వెళ్లి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైలెక్కి బిహార్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లింది. దీంతో బాలుడు కనిపించకపోవటంతో అతని తల్లిదండ్రులు గత నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాలుడి ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ముందు బాలుడిని అనుసరించి వెనుకే రేఖాకుమారి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. రేఖాకుమారి భర్త ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు. బిహార్‌లో ఉన్న రేఖాకుమారిని తిరిగి రప్పించేందుకు భర్తతో కలిసి పోలీసులు వ్యూహ రచన చేశారు.

సోమవారం సికింద్రబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చిన రేఖాకుమారితో పాటు బాలున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలున్ని పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. రేఖాకుమారినిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన పోలీసులను సీఐ సతీష్‌రెడ్డి అభినందించారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రులు అçప్రమత్తంగా ఉండాలని సీఐ సతీష్‌రెడ్డి ప్రజలకు సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top