అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

Interstate Thief Arrested In Khammam - Sakshi

ఖమ్మంక్రైం: పండ్ల తోటలకు కాపలాదారుడిగా ఉండటం అతని వృత్తి. జల్సాగా జీవితం గడపాలన్నది చిన్నప్పటి నుంచి కోరిక. అందుకోసం దొంగతనాలను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. క్రమేణా, ఆ ప్రవృత్తినే... వృత్తిగా మార్చుకున్నాడు. పోలీసులకు చిక్కాడు. సీపీ కార్యాలయంలో బుధవారం పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) తఫ్సీర్‌ ఇక్బాల్‌ వెల్లడించిన వివరాలు... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడి మండలం కామవరపు కోటకు చెందిన నల్లబోతుల సురేష్, పండ్ల తోటలకు కాపలాదారుడిగా పనిచేసేవాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతడు, దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు.

అయినప్పటికీ అతడిలో మార్పు రాలేదు. అక్కడ ఇతని ఉనికి అందరికీ తెలియడంతో ఖమ్మం వచ్చాడు. ఇక్కడే దొంగతనాలు చేయసాగాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా ఎంచుకునేవాడు. తాళాలను పగలగొట్టి, లోనికి ప్రవేశించి నగలను కాజేసేవాడు. వాటిని అమ్మి ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఆ డబ్బు అయిపోయిన తర్వాత మరోసారి దొంగతనానికి దిగుతాడు. 
ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడుచోట్ల, ఖానాపురం హవేలి పరిధిలో రెండుచోట్ల, వన్‌ టౌన్‌ పరిధిలో ఒకచోట చోరీ చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగతనం చేశాడు. అక్కడ అతడిని గుర్తించడంతో పారిపోయాడు.

కోదాడ క్రాస్‌ రోడ్డు వద్ద బుధవారం ఇతడిని సీసీఎస్‌ ఏసీపీ ఈశ్వరయ్య అధ్వర్యంలో రూరల్‌ సీఐ తిరుపతిరెడ్డి, సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడి వ్యవహారం బయటపడింది. ఇతని వద్ద 25 తులాల బంగారపు నగలను స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ 7.12లక్షల రూపాయలు ఉంటుంది.

సిబ్బందికి అభినందన 
దొంగను అరెస్ట్‌ చేసి, సొత్తు రికవరీ చేసిన ఏసీపీ ఈశ్వరయ్య, సీసీఎస్‌ సీఐ వేణుమాధవ్, రూరల్‌ సీఐ తిరుపతిరెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ బాణాల రాము, సీసీఎస్‌ ఎస్‌ఐ ఆనందరావు, సిబ్బంది కోలా శ్రీనివాస్, రమణ, రవి, లతీఫ్, ఖలీద్, కిరణ్‌ గాంధీని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top