అక్షరాల రూ.లక్ష! | Sakshi
Sakshi News home page

అక్షరాల రూ.లక్ష!

Published Fri, Jan 18 2019 10:03 AM

Hyderabad Traffic Collect Daily One Lakh Challan in Drunk And Drive - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కుతున్న ‘నిషా’చరులు సరాసరిన రోజుకు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాల రూ.లక్షకు పైనే. ఈ నెల తొలి పక్షంలో పట్టుబడిన 724 మంది మందుబాబులు కోర్టులో రూ.15,46,600 చెల్లించినట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ గురువారం వెల్లడించారు. మద్యం మత్తులో వాహనం నడపటం ఆరోపణలపై చిక్కిన వారికి జైలు శిక్ష పడిందన్నారు. వీరిలో 79 మంది జైలుకు వెళ్లగా... 56 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను (డీఎల్స్‌) న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడమో, సస్పెండ్‌ చేయడమో జరిగిందని ఆయన వెల్లడించారు. డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసుల్లో చిక్కిన వారి మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు 10 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా... ఒకరిది ఐదేళ్లు, పది మందివి నాలుగేళ్లు, 21 మందివి మూడేళ్లు, ముగ్గురివి రెండేళ్లు, ఐదుగురివి ఏడాది, ఆరుగురివి ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేసినట్లు అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.

జైలుకు వెళ్లిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి రెండు నెలలు, మరొకరికి నెల, ఇద్దరికి 10 రోజులు, 15 మందికి ఐదు రోజులు, నలుగురికి నాలుగు రోజులు, 13 మందికి మూడు రోజులు, 43 మందికి రెండు రోజులు జైలు శిక్ష పడింది. డ్రంక్‌ డ్రైవింగ్‌తో పాటు మరో రెండు రకాలైన ఉల్లంఘనల్నీ తీవ్రంగా పరిగణిస్తూ చార్జ్‌షీట్లు వేస్తున్నామన్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం నేరంపై ఇద్దరికి రెండు రోజులు, ఒకరికి ఒక రోజు జైలు శిక్షలు విధించాయి. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సిలింగ్స్‌ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్తులో పాస్‌పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement