‘ఎంసెట్‌’ కేసులో కొరియర్‌ అరెస్ట్‌ | Courier arrested in EAMCET case | Sakshi
Sakshi News home page

‘ఎంసెట్‌’ కేసులో కొరియర్‌ అరెస్ట్‌

Apr 8 2018 3:05 AM | Updated on Apr 8 2018 3:05 AM

Courier arrested in EAMCET case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సీఐడీ అధికారులు మరో కీలక నిందితుడిని అరెస్ట్‌ చేశారు. బిహార్‌కు చెందిన అఖిలేశ్‌ అలియాస్‌ బాబును 2 రోజులక్రితం సీఐడీ అరెస్ట్‌ చేసినట్టు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఎఫ్‌ఐఆర్‌లో అఖిలేష్‌ ఏ28 నిందితుడిగా ఉన్నాడు. ఎంసెట్‌ కేసులో ప్రశ్నపత్రంపై శిక్షణ ఇచ్చేందుకు విద్యార్థులను 6 ప్రధాన నగరాలకు క్యాంపు గా తీసుకెళ్లారు. ఈ క్యాంపు కేంద్రాలకు అఖిలేష్‌ ప్రశ్నపత్రాలను తరలించేందుకు కొరియర్‌గా వ్యవహరించినట్టు గతంలో అరెస్టయిన నిందితులు విచారణలో వెల్లడించారు. దీనితో అఖిలేష్‌ కదలికలపై నిఘాపెట్టిన సీఐడీ అధికారులు ఎట్టకేలకు బిహార్‌లో అరెస్ట్‌ చేశారు.

ఢిల్లీ శివారులోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌నుంచి రావత్‌ ద్వారా ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చిన కమిలేష్‌కుమార్‌సింగ్, అఖిలేశ్‌ ద్వారా అన్ని శిక్షణ కేంద్రాల్లోని క్యాంపులకు పంపించినట్టు వెలుగులోకి వచ్చింది. దీనితో అఖిలేశ్‌ను అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు క్యాంపులు నిర్వహించిన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, షిరిడీ, పుణేలోని లాడ్జీలను పరిశీలించనున్నారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం అఖిలేష్‌ను తీసుకెళ్లనున్నట్టు కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. క్యాంపుల్లో ప్రశ్నపత్రం అందజేసి అక్కడి నిర్వాహకుల నుంచి, విద్యార్థుల వద్ద వసూలు చేసిన డబ్బు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కమిలేష్‌కుమార్‌కు అందించినట్టు విచారణలో బయటపడింది.  

మరో 16మంది కోసం వేట... 
ఈ కేసులో సీఐడీ 88 మందిని నిందితులుగా గుర్తించింది. వీరిలో కీలక పాత్ర పోషించిన 18 మందిని అరెస్ట్‌ చేసిన సీఐడీ, 44 మంది బ్రోకర్లను సైతం కటకటాల్లోకి పంపించింది. కీలక పాత్రధారులకు అనుచరులుగా ఉంటూ స్కాంలో పాత్ర పోషించిన మరో 16 మందిని సైతం కటకటాల్లోకి నెట్టేందుకు సీఐడీ వేట సాగిస్తోంది. వీరంతా బిహార్, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీకి చెందిన వారుగా అనుమానిస్తోంది. వీరికోసం వివిధ ప్రాంతాల్లో వేట సాగిస్తున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement