శిక్షణ.. ఉద్యోగం.. అంతా తూచ్‌

Cheating in the name of Jobs - Sakshi

ఎస్‌బీఐ, ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలంటూ ప్రకటన 

కోల్‌కతాలో శిక్షణ కేంద్రం పేరుతో 3 నెలల ట్రైనింగ్‌ 

35 మంది నుంచి రూ. కోట్లలో వసూలు

హైదరాబాద్‌: ఎస్‌బీఐ.. ఆర్‌ఆర్‌బీ.. ఇన్‌ కంట్యాక్స్‌ విభాగాల్లో బ్యాక్‌ డోర్‌ ఎంట్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు తీసుకొని కోల్‌కతా కేంద్రంగా 3 నెలలు శిక్షణ ఇచ్చి నకిలీ నియామక పత్రాలు చేతిలో పెట్టి వందల మందిని మోసగించిన ఐదుగురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 35 లక్షల విలువైన కారు, బంగారం, నకిలీ డాక్యుమెంట్లు, రూ. 10.5 లక్షల నగదు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సీపీ మహేశ్‌ భగవత్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు.  

కోల్‌కతా కేంద్రంగా మోసాలు.. 
ఒడిశాకి చెందిన కళ్లు చరణ్‌పాండా అలియాస్‌ అజయ్‌ అలియాస్‌ మనోజ్‌ ఐదేళ్ల క్రితం కోల్‌కతాలో స్థిరపడ్డాడు. కొంతకాలం మార్కెటింగ్‌ బిజినెస్‌ చేసి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తన స్నేహితులైన కలావత్‌ రాయ్, రాజీవ్‌ కార్తీక్, హేమంత్, అనిల్‌తో కోల్‌కతాలో జాబ్‌ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఏర్పాటు చేశాడు. ఇందులో యువతకు శిక్షణ ఇచ్చి ఎస్‌బీఐ, ఆర్‌ఆర్‌బీ, ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పించాడు. అయితే 2015లో వనస్థలిపురంలో నివాసముంటున్న ఆలేరుకు చెందిన శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నప్పుడు చరణ్‌పాండేకు పరిచయమయ్యాడు. 2017లో శ్రీకాంత్‌కు ఫోన్‌ చేసి కోల్‌కతాలో ఎస్‌బీఐ, ఆర్‌ఆర్‌బీ, ఇన్‌కంట్యాక్స్‌ విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని చరణ్‌పాండే చెప్పడంతో వారి ముఠాలో సభ్యుడిగా చేరాడు.

కోల్‌కతాకు నివాసం మార్చుకున్న శ్రీకాంత్‌ పేరును సుధామ్‌గా మార్చుకుని తన స్నేహితులైన రాజీవ్‌ కార్తీక్, ఎం.అశోక్‌రావు, వెంకట్‌ శిరీష్‌లకు విషయం చెప్పడంతో హైదరాబాద్‌కు చెందిన నలుగురు నిరుద్యోగులు కేతావత్‌ మోహన్‌ నాయక్, బానోత్‌ మోహన్, పి.కిషన్, జె.రమేశ్‌లను కోల్‌కతాకు పంపించారు. వీరి నుంచి రూ. 53.5 లక్షలు తీసుకున్న శ్రీకాంత్‌ కోల్‌కతాలోని ఎస్‌బీఐ ట్రైనింగ్‌ సెంటర్‌లో 3 నెలలు ఇతర విద్యార్థులతో కలిసి శిక్షణ ఇప్పించాడు. ఆ తర్వాత నకిలీ స్టాంప్‌లు పెట్టి ఎస్‌బీఐ అధికారులుగా ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. మిర్యాలగూడ నుంచి మరో నలుగురు మాలోత్‌ రమేశ్, కేతావత్‌ అశోక్, కుర్రా విష్ణు, యాతమ్‌ మహేశ్‌ నుంచి శ్రీకాంత్‌ రూ. 43.5 లక్షలు వసూలు చేసి వారికీ నకిలీ నియామక పత్రాలు అంటగట్టాడు. ట్రైనింగ్‌ సెంటర్‌లో రోజు తప్పించి రోజు శిక్షణ ఇచ్చేవాడు. శ్రీకాకుళానికి చెందిన మురళీ కృష్ణ భార్య రమా ప్రసన్న కూడా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేసింది. కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న సంధ్యారాణి 35 మంది నుంచి రూ.16 కోట్లు వసూలు చేసింది. రూ.80 లక్షలు శ్రీకాంత్‌కు ఇచ్చి కోల్‌కతాకు పంపింది. ఈ ముఠా 100 మంది నుంచి రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్లు వరకు వసూలు చేసింది.  

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ల్యాప్‌టాప్‌లు  

మోసపోయిన వారి ఫిర్యాదుతో 
మోసపోయిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన రమేశ్, అశోక్, విష్ణు, మహేశ్‌ తదితరులు ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 18న శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. ఇక చరణ్‌పాండా, మురళీకృష్ణ, వీరరాఘవరెడ్డి, సంధ్యారాణిలను బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, రూ. 10.5 లక్షల నగదు, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 తులాల బంగారం, నకిలీ అపార్ట్‌మెంట్ల డాక్యుమెంట్లు, ప్రింటర్లు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కలిసి ఇరు రాష్ట్రాల్లో వందల మంది నుంచి రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. చరణ్‌పాండ్యా రూ.65 లక్షలతో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ కొన్నాడని విచారణలో తేలింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top