అలాంటోడ్ని నడిరోడ్డులో ఉరితీయాలి

Baba Ramdev Reacts on Daati Maharaj Rape Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న దాతి మహారాజ్‌ ఉదంతంపై యోగా గురు బాబా రాందేవ్‌ తీవ్రంగా స్పందించారు. అలాంటోడ్ని నడిరోడ్డుపై ఉరి తీయాలని ఆయన మీడియా ముందు రాందేవ్‌ వ్యాఖ్యాలు చేశారు. సోమవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాందేవ్‌ను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ‘దాతి వ్యవహారం’పై స్పందించాల్సిందిగా ఆయన్ని కోరింది. ‘కాషాయం ధరించినంత మాత్రాన సాధువులు అయిపోరు. సాధువుల గౌరవానికి, ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఎవరు వ్యవహరించినా సరే వాళ్లు జైలుకు పోవాల్సిందే. భక్తి, ధ్యానం ముసుగులో ఓ మహిళపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వాడేం బాబా?.. అలాంటోడిని నడిరోడ్డులోకి లాక్కోచ్చి ప్రజలే ఉరి తీయాలి’ అని రాందేవ్‌ తీవ్రంగా స్పందించారు.

‘పవిత్రతను పాటించటం సాధువుల బాధ్యత. బాబా ముసుగులో నీచపు పనులకు పాల్పడితే శిక్ష అనుభవించాల్సిందే. సాధువులు కూడా శిష్యులకు హితబోధచేయాలి. నా వరకు నా శిష్యుల్లో ఇప్పటిదాకా అలాంటి వాళ్లెవరూ లేరు. అందుకు నేను గర్విస్తున్నా’అని రాందేవ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే తప్పించుకుని తిరుగుతున్న దాతి మహారాజ్‌కు ఢిల్లీ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు.

లైంగిక ఆరోపణలు.. దేశ రాజధాని శివారులో శ్రీ శనిధామ్‌ ట్రస్ట్‌ పేరిట దాతి మహారాజ్‌ ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. తాజాగా అత్యాచారం కేసు నమోదు అయ్యింది. రెండేళ్ల క్రితం దాతి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మాజీ శిష్యురాలు(25).. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దాతి కోసం రాజస్థాన్‌, ఢిల్లీలోని ఆశ్రమాల్లో గాలింపు చేపట్టారు. అయితే దాతి మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. పైగా ఓ వీడియో సందేశంలో ‘బాధితురాలు తన కూతురులాంటిదని, భక్తులంతా సహనంగా ఉండాలంటూ’ పిలుపునిచ్చాడు. అయితే దాతిని ఇప్పటిదాకా అరెస్ట్‌ చేయకపోవటంపై ఢిల్లీ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రంగంలోకి దిగి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top