‘మత్తు’ మింగేసింది..

Another death by the drunk and drive - Sakshi

నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు మరో ప్రాణం బలి 

హైదరాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ మరో ఘోరానికి కారణమైంది. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారులో దూసుకువచ్చిన ఓ వ్యక్తి.. ముందు వెళ్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువతుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు బ్రెయిన్‌డెడ్‌ కాగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

మోతాదుకు మించి మద్యం తాగి.. 
పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట ప్రాంతానికి చెందిన పాల విష్ణువర్థన్‌(35) హిమాయత్‌నగర్‌లో బ్రైౖట్‌ స్పార్క్‌పేరుతో ప్లేస్కూల్‌ నడిపిస్తున్నాడు. ఇతని భార్య ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లు దుబాయ్‌లో పనిచేసి వచ్చిన విష్ణు శనివారం రాత్రి మాదాపూర్‌లోని స్నేహితుడి ఇంట్లో జరిగిన విందుకు హాజరయ్యాడు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్న విష్ణు, మోతాదుకు మించి మద్యం తాగి అదే స్థితిలో తన టాటా హెక్సా(టీఎస్‌09ఈవీ7707) కారు నడుపుకుంటూ ఇంటికి బయలుదేరాడు. మామూలుగా అయితే పంజగుట్ట రావడానికి విష్ణు జూబ్లీహిల్స్‌ 36/10 రోడ్డును వినియోగించాలి. కానీ అక్కడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు జరుగుతున్నాయని ముందే తెలియడంతో విష్ణు గల్లీల మీదుగా.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోకి వెళ్లాడు. 

200 మీటర్లు ఈడ్చుకెళ్లి.. 
ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఈ కారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని డైమండ్‌ హౌస్‌ దాటుకుని ముందుకు వెళ్లింది. మితిమీరిన వేగంతో ఉన్న కారు అదుపుతప్పి ముందు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న అనూషారెడ్డి అలియాస్‌ ప్రియారెడ్డి అలియాస్‌ వెంకటలక్ష్మి(30)తో పాటు మధ్యలో కూర్చున్న మస్తానీ(35), వెనక కూర్చున్న అనూష(19) రోడ్డుపై పడ్డారు. హెక్సా కారు బాటమ్‌ కాస్త ఎత్తుగా ఉండటంతో మస్తానీ కారు కింద ఇరుక్కుపోయింది. మద్యం మత్తులో ఈ విషయాన్ని గుర్తించని విష్ణు అలానే దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకుపోయాడు. దీంతో మస్తానీ అక్కడికక్కడే మృతిచెందింది. అనూషారెడ్డి తల పగలడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అనూష నడిరోడ్డుపై విలవిల్లాడుతుండటంతో గుర్తించిన స్థానికులు ‘108’కి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన జూబ్లీహిల్స్‌ పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి, మస్తానీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  
మృతురాలు, క్షతగాత్రులు ఎవరు? 
ప్రమాదంలో మృతిచెందిన మస్తానీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారి దేవభక్తుని సురేష్‌కుమార్‌కు రెండో భార్య అని తేలింది. రెండేళ్ల నుంచి శ్రీనగర్‌కాలనీలోని గణేష్‌ కాంప్లెక్స్‌ వద్ద ఇల్లు అద్దెకు తీసుకుని స్నేహితులతో కలసి ఉంటోంది. జూనియర్‌ ఆర్టిస్టుగా, బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మస్తానీ ఫోన్‌లో ఉన్న నంబర్‌ ఆధారంగా భర్త సురేష్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు. కాగా, బ్రెయిన్‌డెడ్‌ అయిన అనూషారెడ్డికి సంబం«ధించిన వివరాలపై మిస్టరీ నెలకొంది. ప్రస్తుతం మస్తానీతోపాటే ఉంటున్న ఈమె కొన్నాళ్లు జూనియర్‌ ఆర్టిస్ట్‌గా చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అనూష మూడు రోజుల క్రితమే సిటీకి వచ్చి కూకట్‌పల్లికి చెందిన నిహారిక అనే యువతి వద్ద ఉంటున్నట్లు తెలిసింది. మస్తానీ ప్రతి ఆదివారం కిట్టీ పార్టీలు నిర్వహిస్తుంటుంది. శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో స్కూటీపై కూకట్‌పల్లి వెళ్లిన మస్తానీ, అనూషారెడ్డి.. ఆదివారం తమ ఇంట్లో కిట్టీపార్టీ ఉందని రావాలని అనూషను కోరడంతో ముగ్గురూ కలసి స్కూటీపై బయలుదేరారు. అయితే వీరంతా ఆ సమయంలో ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారనే దానిపై స్పష్టత లేదు. ఈ ముగ్గురికీ పరిచయం ఏంటనేది తేలాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. 

ప్రమాదం జరిగినా.. కారు ఆపలేదు.. 
తన కారు స్కూటీని ఢీకొన్నా.. విష్ణు కారు ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా వేగాన్ని మరింత పెంచుతూ దాదాపు అర కిలోమీటర్‌ వెళ్లిపోయాడు. అక్కడి సదరన్‌ స్పైస్‌ రెస్టారెంట్‌ వద్ద వేగాన్ని నియంత్రించలేకపోవడంతో కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అక్కడకు చేరుకున్న పోలీసులు విష్ణును అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు మద్యం తాగిన ఆనవాళ్లు ఉండటంతో శ్వాసపరీక్ష యంత్రంతో పరీక్షించారు. దీంతో విష్ణు బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ 206గా నమోదైంది. విష్ణును అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతనిపై ఐపీసీలోని 304(పార్ట్‌–2), 337, ఎంవీ యాక్ట్‌లోని 185 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top