ఇక పతంజలి 'దివ్య జల్'
పతంజలి బ్రాండ్ ద్వారా మరో నూతన ఉత్పత్తి విడుదలకు యోగా గురు బాబా రాందేవ్ రెడీ అయ్యారు.
- దీపావళి రోజున విడుదల
ముంబై: పతంజలి బ్రాండ్ ద్వారా మరో నూతన ఉత్పత్తి విడుదలకు యోగా గురు బాబా రాందేవ్ రెడీ అయ్యారు. దంత్ కాంతి వంటి విజయవంతమైన స్వదేశీ ఉత్పత్తులతో విదేశీ బ్రాండ్‌లకు గట్టి పోటీనిస్తున్న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ నుంచి 'దివ్య జల్' మినరల్ వాటర్ బాటిళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. దీపావళి రోజున దివ్య జల్ వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉంటాయని రాందేవ్ ప్రకటించారు. వచ్చే 3 నుంచి 6 నెలల కాలంలో ఈ బాటిళ్లు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని స్టోర్స్‌లో లభ్యమవుతాయన్నారు. మంచి నీటిని హరిద్వార్, లక్నోలలోని తమ ప్లాంట్లలో బాటిలింగ్ చేస్తున్నట్లు తెలియజేశారు. రోజుకు లక్ష బాటిళ్లను ప్యాకేజింగ్ చేయగల సామర్థ్యం లక్నో ప్లాంట్‌కు ఉందని వివరించారు.
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విభాగంలో 2018-19 టార్గెట్ రూ.1,000 కోట్లుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. 2016లో ఈ-మార్కెట్ అంచనా అమ్మకాలు రూ.7,040 కోట్లుగా ఉండగా, ఇందులో 24 శాతం మార్కెట్ వాటాతో బిస్లరీ ముందు వరుసలో ఉందని వివరించారు. 2021 నాటికి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల అమ్మకాలు రూ.15,080 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. పతంజలి బ్రాండ్ నేమ్‌తో ఎఫ్‌ఎంసీజీ రంగంలోనే బలమైన ముద్ర వేసిన ఈ యోగా గురు త్వరలోనే దుస్తుల విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు.