చమురుకు మళ్లీ కరోనా కాటు | Crude prices tumbles due to new Corona cases | Sakshi
Sakshi News home page

చమురుకు మళ్లీ కరోనా కాటు

Jun 15 2020 10:17 AM | Updated on Jun 15 2020 10:20 AM

Crude prices tumbles due to new Corona cases - Sakshi

తాజాగా చైనాలో కరోనా వైరస్‌ సోకిన కేసులు బయటపడంతో ముడిచమురు ధరలకు షాక్‌ తగిలింది. ఏప్రిల్‌ తదుపరి గత వారం తిరిగి పతనమైన చమురు ధరలు నేటి ట్రేడింగ్‌లోనూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. లండన్‌ మార్కెట్లో ప్రస్తుతం బ్రెంట్‌ బ్యారల్‌ 2 శాతం క్షీణించి 38 డాలర్ల దిగువకు చేరగా.. న్యూయార్క్‌ మార్కెట్లోనూ నైమెక్స్‌ బ్యారల్‌ 3 శాతం వెనకడుగుతో 35.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 10 నుంచి చూస్తే చమురు ధరలు 11 శాతం పతనమమ్యాయి. బీజింగ్‌ వ్యవసాయ మార్కెట్లో సుమారు 25 మందివరకూ కరోనా వైరస్‌ బారినపడినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోపక్క శనివారం అమెరికాలో కోవిడ్‌-19 కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగినట్లు వెల్లడైంది. దీంతో రెండో దశలో కరోనా వైరస్‌ విజృంభించనుందన్న అంచనాలు ఆందోళనలు కలుగజేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే కోవిడ్‌-19 ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం విదితమే.

గత వారం పతనం
ఆరు వారాల ‍ముడిచమురు ర్యాలీకి గత వారం బ్రేక్‌ పడింది. ఫలితంగా చమురు ధరలు 8.3 శాతం నష్టపోయాయి. కోవిడ్‌-19 కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020లో ఏకంగా 6.5 శాతం క్షీణత చవిచూడవచ్చని కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వేసిన అంచనాలు గత వారాంతాన చమురు ధరలను దెబ్బతీశాయి. అమెరికాలో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరనున్నట్లు ఫెడ్‌ తాజాగా వేసింది. దీంతో అమెరికాసహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోనున్న అంచనాలు బలపడ్డాయి. ఫలితంగా చమురుకు డిమాండ్‌ పడిపోనుందన్న ఆందోళనలు తలెత్తాయి. దీనికితోడు గత వారం అమెరికాలో ఇంధన నిల్వలు అనూహ్యంగా పెరిగాయి. ఈ నెల 5తో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7 మిలియన్‌ బ్యారళ్లమేర పెరిగి 538 మిలియన్‌ బ్యారళ్లను అధిగమించినట్లు యూఎస్‌ ఇంధన ఏజెన్సీ వెల్లడించింది. దీంతో చమురు నిల్వలు సరికొత్త రికార్డ్‌ గరిష్టానికి చేరుకున్నట్లు తెలియజేసింది. గతేడాది ఇదే సమయంలో దాదాపు 486 మిలియన్‌ బ్యారళ్ల నిల్వలు మాత్రమే నమోదయ్యాయి. నిజానికి 1.45 మిలియన్‌ బ్యారళ్ల తగ్గుదల నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. 

చైనా ఎఫెక్ట్‌
చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే చైనాలో తిరిగి కరోనా వైరస్‌ కలకలం సృష్టించడంతో ఇంధన డిమాండ్‌ తగ్గనున్నట్లు విశ్లేషకులు భావిస్తు‍న్నారు. కోవిడ్‌-19 ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంబారిన పడనున్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. అమెరికాసహా పలు దేశాలలో కరోనా వైరస్‌ మరోసారి వ్యాపించవచ్చని.. ఇది సుదీర్ఘ లాక్‌డవున్‌లకు దారితీయవచ్చని కొంతమంది నిపుణులు ఇటీవల అంచనా వేస్తున్నారు. ఇది అంతర్గతంగా సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు ఇంధన వర్గాలు తెలియజేశాయి.కాగా.. ధరలకు స్థిరత్వాన్ని ఇచ్చేందుకు రష్యాసహా ఒపెక్‌ దేశాలు రోజుకి 9.7 మిలియన్‌ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జులై చివరివరకూ ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నాయి. 
.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement