బాబా రాందేవ్ మరో కొత్త వ్యాపారం
ఫుడ్, మెడిసిన్స్, కాస్మోటిక్స్‌లలో సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్ బట్టల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు.
ఫుడ్, మెడిసిన్స్, కాస్మోటిక్స్‌లలో సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్ బట్టల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. త్వరలోనే బాబా రాందేవ్ బ్రాండెడ్ వస్త్రాలు, మన పక్కనే ఉన్న బట్టల దుకాణాలోకి రానున్నాయని తెలిసింది. ''స్వదేశీ'' లైనప్‌లో పురుషులు, మహిళలు, పిల్లల కోసం రాందేవ్ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ బట్టల వ్యాపారాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించనుందని ఆ కంపెనీ అధికారిక ప్రతినిధి ఎస్‌కే టిజారావాలా చెప్పారు. ప్రారంభమైన తొలి ఏడాదే ఈ వస్త్రాల విక్రయ టార్గెట్ రూ.5000 కోట్లగా పతంజలి నిర్థారించుకుందని తెలిపారు.
ఈ టార్గెట్ చేధించడానికి ఇప్పటికే వస్త్రాల తయారిని కూడా చేపడుతున్నారని పేర్కొన్నారు. ఊలు, కాటన్, నైట్ వేర్, మెషీన్ మేడ్, డెనిమ్ వంటి బట్టలను మార్కెట్‌లోకి తీసుకొస్తామని టీజారావాల చెప్పారు. స్వదేశీ ఏజెండాలో తీసుకొస్తున్న ఈ బట్టల వ్యాపారానికి 'పరిదాన్' అనే పేరును పెట్టాలని కూడా చూస్తున్నారట. ఈ వ్యాపారాలకు తగ్గ బ్రాండు పేరు పెట్టాలని చూస్తున్నామని టిజారావాల పేర్కొన్నారు.
2018 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 250 ఎక్స్‌క్లూజివ్ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ అప్పీరెల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అంతేకాక పతంజలి స్టోర్లు కూడా బిగ్ బజార్ లాంటి ఇతర అప్పీరెల్ రిటైల్ అవుట్‌లెట్లకు వీటిని అమ్మేలా నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని చెప్పారు. దీనికోసం ఇప్పటికే బిగ్ బజార్‌తో పతంజలి చేతులు కలిపింది. తమ ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేయడానికి, సరఫరా, మార్కెట్ చేయడానికి ఈ అవుట్‌లెట్లతో 2015 అక్టోబర్‌లోనే ఒప్పందం చేసుకున్నామని టిజారావాల తెలిపారు.
గత నెలలోనే పరాక్రమ్ సురక్ష ప్రైవట్ లిమిటెడ్ పేరుతో ప్రైవేట్ సెక్యురిటీ బిజినెస్‌లోకి కూడా బాబా రాందేవ్ అడుగుపెట్టారు. స్ట్రెస్డ్ అసెట్స్ కలిగిన ఉన్న మౌలిక సదుపాయాల కంపెనీలను కొనుగోలుచేయడానికి పతంజలి చూస్తోంది. పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్‌లు మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు వీటి అమ్మకాలు రూ.10,561 కోట్లగా ఉన్నాయి. 2018 మార్చి వరకు వీటిని రూ.20వేల నుంచి రూ.25వేల కోట్లకు పెంచుకోవాలని చూస్తున్నట్టు రాందేవ్ చెప్పారు.