యోగాగురు బాబా రాందేవ్ కొత్త వ్యాపారం
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న యోగగురు బాబా రాందేవ్ ఓ కొత్త ప్రైవేట్ సంస్థను ఏర్పాటుచేశారు.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న యోగగురు బాబా రాందేవ్ ఓ కొత్త ప్రైవేట్ సంస్థను ఏర్పాటుచేశారు. లాభాదాయకమైన భద్రతా వ్యాపారాల్లోకి ప్రవేశించారు. ''పరాక్రమ్ సురక్ష ప్రైవేట్ లిమిటెడ్'' పేరుతో జూలై 10న భద్రతా సంస్థను బాబా రాందేవ్ లాంచ్ చేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. బాబా రాందేవ్ సైతం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. తమ సెక్యురిటీ సంస్థ ద్వారా దేశంలో 20-25వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. త్వరలోనే తమ సంస్థ దేశంలోనే అతిపెద్ద భద్రతా కంపెనీల్లో ఒకటిగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తంచేశారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చిన వ్యక్తుల్లో బాబా రాందేవ్ ఒకరు. యోగ తర్వాత ఆయన ఎక్కువగా ఆయుర్వేద ఉత్పత్తులపై దృష్టిసారించారు. పతంజలి బ్రాండుతో ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశించారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతిఒక్కర్ని వ్యక్తిగతం రక్షణ కోసం, దేశభద్రతా విధుల కోసం సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమని రాందేవ్ చెప్పారు. రిక్రూట్ చేసుకున్న యువతకు శిక్షణ ఇవ్వడానికి పదవీ విరమణ పొందిన ఆర్మీ, పోలీసు అధికారులను ఆయన నియమించుకుంటున్నారు. హరిద్వారలోని పతంజలి క్యాంపస్‌లో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. రాందేవ్ బాబా ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాలు 2016 నాటికి రూ.1,100 కోట్లుగా ఉన్నాయి. అదేఏడాది రాందేవ్ బాబా పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ సంపద రూ.25,600 కోట్లకు ఎగిసి భారత్‌లో 25వ ధనికవంతుడిగా నిలిచారు. ఎఫ్‌ఎంసీజీ వెంచర్‌లో తమ ఉత్పత్తులను విస్తరించుకుంటూ పోతూ.... ఎంఎన్‌సీలకు, దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలకు రాందేవ్ పెనుముప్పుగా నిలుస్తున్నారు.