వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా కళత్తూరు నారాయణస్వామి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన జిల్లా కన్వీనర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా కళత్తూరు నారాయణస్వామి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన జిల్లా కన్వీనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఆదివారం జరిగిన ఆ పార్టీ రెండో ప్లీనరీలో పలు జిల్లాల అధ్యక్షులను ప్రకటించారు.
ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి నారాయణస్వామిని అధ్యక్షులుగా కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. 2011లో ఈయనను జిల్లా కన్వీనర్‌గా నియమించారు. ప్రస్తుతం గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా తనను నియమించడం పట్ల నారాయణస్వామి పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తిరుపతి నగర అధ్యక్షుడుగా పాలగిరి ప్రతాప్‌రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షులుగా పాలగిరి ప్రతాప్‌రెడ్డిని నియమించారు. ఈయన ప్రస్తుతం నగర కన్వీనర్ హోదాలో కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పాలగిరి నగర పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నగర పార్టీ అధ్యక్షుడుగా నియమించినందుకు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి, సహకరించిన జిల్లా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.