స్త్రీ మూర్తికి  ‘కళాత్మక’ అభినందన

Women's Day Celebrations Were Commemorated By Artistically Inspiring Women. - Sakshi

సాక్షి, నెల్లూరు(బృందావనం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింహపురికి చెందిన కళాకారులు తమ భావాలను కళారూపంలో వ్యక్తీకరించారు.  సందేశాత్మకంగా మహిళలకు స్ఫూర్తినిస్తూ కళాభివందనాలతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 


నగరంలోని మూలాపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు గంధవళ్ల ఉమాశంకర్‌ కోకకోలా శీతలపానీయం డబ్బా పై పిడికిలి బిగించి, జై కొడుతున్న మహిళ చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. మహిళలు ఏ రంగంలో తీసిపోరని, సమాజంలో మహిళాసాధికారత సాధించాలని కాంక్షిస్తూ రెండు గంటల సమయంలో స్త్రీ మూర్తి రూపాన్ని  తీర్చిదిద్దానన్నారు.


నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌కు చెందిన కార్పెంటర్‌ శ్రీనివాసులు తన వృత్తి నైపుణ్యంతో 8 అంగుళాల ఎత్తు, రెండున్నర అంగుళాల వెడల్పు ఉన్న  కొయ్య ముక్కపై స్త్రీ రూపాన్ని రెండు గంటల సమయంలో తీర్చిదిద్దారు. మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటాలని కాంక్షించారు.


ముత్తుకూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని నారికేళపల్లి పంచాయతీ సుబ్బారెడ్డిపాళెం యూపీ స్కూల్‌ తెలుగు పండిట్‌ సోమా పద్మారత్నం గురువారం సీసాలో ‘జాగృతి మహిళ’ చిత్రాన్ని నిక్షిప్తం చేశారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా లోకానికి తన కళారూపం ద్వారా అభినందనలు తెలిపారు.

 
నెల్లూరుకు చెందిన సూక్ష్మరూప చిత్ర కళాకారుడు వెంకటశేషగిరిరావు చిన్న రబ్బర్‌ ముక్క(ఎరేజర్‌)పై అర సెంటీమీటర్‌ ఎత్తు, అర సెంటీమీటర్‌  వెడల్పుతో కలర్‌ పెయింటింగ్‌ను తీర్చిదిద్దారు. రెండు గంటల పాటు శ్రమించి చిత్రానికి రూపమిచ్చానని చెప్పారు. 
సుద్ద ముక్కపై మహిళకు సూక్ష్మరూపం 


అనుమసముద్రంపేట: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఎస్‌పేట మండలంలోని హసనాపురం ప్రాథమిక పాఠశాల ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడు పార్థసారథి సుద్ద ముక్కపై కూర్చున్న మహిళ ఆకృతిని తయారు చేశారు. ఒక మహిళ దుఃఖిస్తూ, ప్రాధేయపడుతూ దేశంలో ఉన్న మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్న అర్థం తెలిపేలా ఈ సూక్ష్మరూపాన్ని చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. మూడు సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా చాక్‌పీసులతో ఈ బొమ్మను తయారు చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top