వసుధైక కుటుంబం ఇస్రో | Venkaiah naidu comments on ISRO | Sakshi
Sakshi News home page

Oct 5 2017 3:20 AM | Updated on Oct 5 2017 3:20 AM

Venkaiah naidu comments on ISRO

శ్రీహరికోట(సూళ్లూరుపేట): దేశంలోని సగటు మానవుడికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలను అందుబాటులోకి తీసుకొస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వసుధైక కుటుంబం లాంటిదని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రపంచ అంతరిక్ష వారో త్సవాలను సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని కురూప్‌ ఆడిటోరియంలో బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వారోత్సవాలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.  

ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ అంతరిక్ష పితామహులు విక్రమ్‌సారాభాయ్, ఏపీజే అబ్దుల్‌ కలాం, ప్రొఫెసర్‌ సతీశ్‌ ధావన్‌ లాంటివారు నాటిన అంతరిక్ష ప్రయోగాల బీజాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగాయన్నారు.

మన ఉపగ్రహాల్ని విదేశీ స్పేస్‌ సెంటర్ల నుంచి ప్రయోగించే స్థాయినుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్లద్వారా 25 దేశాలకు చెందిన 209 విదేశీ ఉపగ్రహాల్ని పంపించే స్థాయికి చేరడంతో ప్రపంచదేశాలు భారత్‌వైపు చూస్తున్నాయని చెప్పారు.  1972లో విద్యార్థిగా ఎక్స్‌కర్షన్‌కు వచ్చి శ్రీహరి కోట రాకెట్‌ కేంద్రాన్ని సందర్శించిన తాను ఇప్పుడు ఉప రాష్ట్రపతి హోదాలో ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ శ్రీహరికోట నుంచి ప్రయోగించే ఉప గ్రహాలవల్ల సామాన్యులకు సైతం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో కొచ్చిందన్నారు. సభకు ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. ఉప రాష్ట్రపతిని ఇస్రో చైర్మన్‌ శాలువాతో సత్కరించి జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నమూనాతో కూడిన జ్ఞాపికను అందజేశారు.

గవర్నర్‌ నరసింహన్‌కు షార్‌ డైరెక్టర్‌ పి.కున్హికృష్ణన్‌ రాకెట్‌ నమూనా జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో షార్‌ కంట్రోలర్‌ జేవీ రాజారెడ్డి, ఏపీ వ్యవసాయ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement